రాబోయే సంక్రాంతికి తెలుగు నుండి మూడు సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడే ‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమా జనవరి 10న వస్తుందని ప్రకటించిన టీమ్.. ఆ మేరకు షూటింగ్‌ను చకచకా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు . ఒకపక్క షూటింగ్ చేస్తూనే మరోపక్క సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. వారం వారంకి ఏదొక పోస్టర్ వదుల్తూ..ఇందులో వివిధ పాత్రలకు ఎంపికైన నటీనటుల వివరాలు వెల్లడిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.
సంక్రాంతికి మరో సినిమా రామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ‘వినయ విధేయ రామ’. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కొంచెం లేట్‌గా స్టార్ట్ అయినప్పటికీ బాగానే బజ్ తెచ్చుకుంది. ఇక మూడో సినిమా ‘ఎఫ్-2’. ఈరెండింటితో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం వెనకపడిందనే చెప్పాలి. ఆ మధ్య ఏదో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కానీ.. అదేదో షాపింగ్ మాల్ యాడ్ కోసం ఇచ్చిన యాడ్ లాగా కనిపించింది. రీసెంట్‌గా టీజర్ రిలీజ్ అయింది.
ఈ టీజర్‌తో ఈ సంక్రాంతి రేస్‌లో హిట్ కొట్టేది ‘ఎఫ్-2’ అన్నట్టుగా టీజర్ ఉంది. టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీని డీల్ చేయడంలో దిట్ట అని మరోసారి నిరూపించుకున్నాడు. వెంకీ..వరుణ్‌ల మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. కాన్సెప్ట్ పరంగా కొత్తేమీ కాదు.. కానీ తెలిసిన కథల్నే వినోదాత్మకంగా చెప్పడంలో అనిల్ మరోసారి తన ముద్ర చూపించినట్లున్నాడు. లేట్ గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాం అన్న రీతిలో ఈ సినిమా ఉండబోతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. పైగా ఈసినిమాకు కలిసొచ్చే అంశం ఏంటంటే సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవ్వడం. ఎందుకంటే సంక్రాంతి సీజన్ యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలు కూడా ఊహించని స్థాయిలో విజయం సాధించాయి. ఉదాహరణకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’.. ‘శతమానం భవతి’.
అందుకే దిల్ రాజు ఈసినిమాను పట్టుబట్టి సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకోవడానికి కూడా ఇదే కారణం. సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకులు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు చూడ్డానికే ఎక్కువ ఇష్టపడతారు. కామెడీ బాగుంటే ఒకటికి రెండు సార్లు చూసే అవకాశం ఉంది.