తెలుగు మాత్రమే కాదు ఏ భాషకు చెందిన చిత్ర పరిశ్రమను తీసుకున్నా.. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినంతమంది హీరోలు వేరే ఎవరి ఫ్యామిలీ నుంచీ రాలేదేమో. ఆల్రెడీ ఒక క్రికెట్ టీం కి సరిపడేంత మంది హీరోలున్న మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో ఇద్దరుముగ్గులు హీరోలు పరిచయమయ్యేందుకు సన్నద్ధమవుతున్నారు. అలాగని.. హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నావాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారా అంటే అదీ లేదు. ఇప్పుడు ఈ క్రీడా స్ఫూర్తిని ఇన్స్పైర్ అయ్యాడో ఏమో తెలియదు కానీ.. ఆల్రెడీ పరిచయం చేసిన బెల్లంకొండ శ్రీనివాసే ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకోవడం కోసం నానా ఇబ్బందులుపడుతున్న తరుణంలో.. తన మరో కొడుకు గణేష్ ను కథానాయకుడిగా పరిచయం చేయనున్నాడు బెల్లంకొండ సురేష్.
దశాబ్ధకాలంగా ఇండస్ట్రీలో నిర్మాతగా, ఫైనాన్షియర్ గా ఉన్న బెల్లంకొండ సురేష్..తన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ ను అల్లుడు శీను చిత్రంతో హీరోగా పరిచయం చేశాడు. ఆ సినిమాకి డబ్బులు రాకపోయినా.. భారీ చిత్రం కావడంతో శ్రీనివాస్ కు గుర్తింపు మాత్రం వచ్చింది. ఆ తర్వాత నుంచే వరుసపెట్టి భారీ చిత్రాలతో ప్రేక్షకుల మీద దండెత్తుతూనే ఉన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇటీవల వచ్చిన కవచం కూడా శ్రీనివాస్ ను ఫ్లాపుల బారి నుంచి తప్పించలేకపోయింది.
ఈ తరుణంలో సురేష్ తన రెండో తనయుడు గణేష్ ను హీరోగా పరిచయం చేస్తుండడం పట్ల భిన్న స్పందనలు వస్తున్నాయి. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం వచ్చే నెల హైద్రాబాద్ లో భారీగా జరగనుంది. మరి గణేష్ బాబు తన బ్రదర్ బెల్లంకొండ చేసిన తప్పుల్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా అడుగులేస్తాడో.. లేక భారీ బాట పట్టి శ్రీనివాస్ లాగే మిగిలిపోతాడో చూడాలి.