హరీష్ శంకర్ డీజే తర్వాత భారీ గ్యాప్ తో మరో సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అది తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తండా తెలుగులో రీమేక్ చెయ్యబోతున్నాడు హరీష్ శంకర్. డీజే తర్వాత మల్టీస్టారర్ గా దాగుడు మూతలు సినిమాని దిల్ రాజు బ్యానర్ లో చేద్దామనుకుంటే.... ఆ సినిమాకి హీరోలు దొరక్కో... దిల్ రాజు రిస్క్ చెయ్యలేకో... ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఈలోపు హరీష్ శంకర్ తమిళ రీమేక్ ని నమ్ముకుని ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టేశాడు. హరీష్ రీమేక్ చేయబోయే సినిమాలో వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రని చేయబోతున్నాడని వరుణ్ క్లారిటీ ఇచ్చేశాడు.
ఇకపోతే హరీష్ శంకర్ గతంలో బాలీవుడ్ మూవీ దబాంగ్ ని, గబ్బర్ సింగ్ గా రీమేక్ చేశాడు. అయితే సినిమాని రీమేక్ చేసినా కేవలం స్టోరీని మాత్రమే తీసుకున్న హరీష్ శంకర్ ఆ కథని.... తన స్టయిల్ మార్క్ కామెడీ పెట్టేసి సినిమాని తెరకెక్కించాడు. గబ్బర్ సింగ్ కామెడీ బ్యాచ్ చేసిన కామెడీ వీర లెవల్లో పండి సినిమా సూపర్ హిట్ కాదు కాదు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు తాను రీమేక్ చెయ్యబోయే జిగర్తండా కథని తీసుకుని తన మార్క్ కామెడీతో సినిమా స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడట హరీష్ శంకర్. మరి తమిళ జిగర్తండా కూడా తెలుగులో కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కబోతుందన్నమాట.
ఇక కామెడీ ఎంటర్టైనర్ గా గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హరీష్ శంకర్..ఇపుడు జిగర్తండాతో కూడా కామెడీ హిట్ కొట్టేస్తాడేమో... చూడాలి. ప్రస్తుతానికి హరీష్ కి విలన్ వరుణ్ తేజ్ దొరికేశాడు కానీ.. మిగతా నటీనటులను ఎంపిక చెయ్యాల్సి ఉంది.