ఎన్నో రోజులు వార్తల్లో నిలిచిన మీటూ ఉద్యమం ఇప్పటికీ మీడియాకు టీఆర్పీలు, సర్క్యులేషన్ వంటివి పెంచే మూలస్థంభంగా నిలుస్తూనే ఉంది. తాజాగా అరవింద్‌స్వామి అసలు బాధితుల కంటే దానిని చెప్పి, పెంచి పోషిస్తూ పబ్లిసిటీకి వాడుకుంటున్న వారే అధికమని బాగానే చీవాట్లు పెట్టాడు. ఇక హైదరాబాదీ హీరోయిన్ అయిన అదితీరావు హైదరి పలుమార్లు తనపై జరిగిన కాస్టింగ్ కౌచ్ గురించి చెబుతూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయినా ఆమె ఎన్నిసార్లు ఒకే విషయం చెప్పినా మీడియా మాత్రం దానిని చెప్పిన ప్రతిసారి హెడ్‌లైన్స్‌కే వాడుకుంటోంది.
తాజాగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్ ప్రారంభంలో నాకు అనేక వేధింపులు ఎదురయ్యాయి. ఇక ప్రాజెక్ట్‌కి సంబంధించి అడ్జెస్ట్ అయితే చాన్స్ ఇస్తామని చెప్పారు. ఇలాంటి లైంగిక వేధింపులను నేను ఎదుర్కొన్నాను. అయితే దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించకుండా లైట్‌గా, సింపుల్‌గా తీసుకున్నాను. ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాను. దానివల్ల ఎనిమిది నెలలు పని కోల్పోయి ఖాళీగా ఉన్నాను. ఆ సమయంలో చాలా అప్సెట్ అయ్యాను. ఇక సినిమాలలో నటించలేనా? అని నాలో నేనే ఎంతో బాధపడ్డాను. అయితే నాటీమ్, నా మేనేజర్ నన్ను నా నెగటివ్ ఆలోచనల నుంచి బయటకు తెచ్చారు’’ అని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని ఈమె పలుమార్లు మీడియాకి తెలిపిన విషయం తెలిసిందే.
ఇక మన తెలుగమ్మాయి, వైజాగ్‌కి చెందిన సీనియర్ నటీమణి గౌతమి మాత్రం ఎంతో హుందాగా స్పందించింది. దేశంలో వరుసగా అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. దేశంలో ఆడవారికే కాదు.. మగవారికి కూడా రక్షణ లేకుండా పోయింది. అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా రక్షణ లేదు. వారు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. చట్టవిరుద్దమైన కార్యక్రమాలను అడ్డుకోవాల్సింది ప్రభుత్వాలే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
ఇక ఈమె ఎంతోకాలం క్యాన్సర్‌తో బాధపడిన సంగతి, కమల్ వల్ల మానసిక క్షోభను ఎదుర్కొన్న విషయం విదితమే. ఈమె క్యాన్సర్ మహమ్మారిపై మాట్లాడుతూ, యోగా అద్భుతాలు చేస్తుంది. యోగా వల్లనే నేను క్యాన్సర్ నుంచి బయటపడగలిగాను. యోగా ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలను కూడా మొగ్గ దశలోనే తుంచి వేయవచ్చు. యోగా కారణంగానే నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఈ విషయాలలో గౌతమి చెప్పిన ప్రతి మాటా అక్షరసత్యమేనని చెప్పాలి.