నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే. ఈ భాషా చెప్పడు.. చెప్పింది చేయకుండా వదలడు వంటి పంచ్ డైలాగ్సే ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకి విపరీతమైన క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టాయి. ఆయన డైలాగ్స్ ప్రజల మనసుల్లోకి వేగంగా చొచ్చుకుని పోయి సామెతలుగా, ఉపమానాలుగా అందరి నోళ్లలో నానుతూ ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో రజనీ చిత్రాలలోని డైలాగ్స్‌లో పవర్ తగ్గింది. వయసు పైబడిన రీత్యా కాస్త స్టైల్, స్పీడ్ తగ్గాయి. ఇక ఆయన గెటప్‌లు, ఆయన ఎంచుకునే కథలు సార్వజనీకంగా అన్ని భాషల వారికి నచ్చేట్లు ఉంటాయి.
కానీ ఇటీవల కాలంలో రజనీ చిత్రాలలో ఎక్కువగా తమిళ వాసన కనిపిస్తోంది. ఇది కాకతాళీయమో.. మరి కావాలని ఆయన రాజకీయాలలోకి ప్రవేశించనున్న నేపధ్యంలో తమిళం మీదనే ఫోకస్ పెట్టాడో అర్దం కాని పరిస్థితి. ఇలా ఆయన నటించిన ‘కబాలి, కాలా’ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. ఇక ‘2.ఓ’ది మరో వెరైటీ స్టోరీ. ఇక విషయానికి వస్తే గతంలో తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తమిళంలోనే టైటిల్ పెట్టే చిత్రాలకు, క్లీన్‌యు సర్టిఫికేట్ తెచ్చుకున్న మూవీలకు పన్నులో మినహాయింపునిచ్చి ప్రోత్సహించింది. కానీ ప్రస్తుతం ఆ నిబంధన తమిళంలో లేదు. అందుకే ‘రోబో’ చిత్రానికి కొత్తగా పదం కనుక్కుని మరీ ‘యంతిరన్’ అని పెట్టారు. ఇక పలు చిత్రాలు క్లీన్‌యు సర్టిఫికేట్ కోసం కూడా అడ్డదారులు తొక్కేవి. కానీ ఇప్పుడు రజనీ స్వేచ్చా జీవి అయ్యాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘పెట్టా’. సన్‌పిక్చర్స్ సంస్థ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్‌సుబ్బరాజు దర్శకత్వంలో దీనిని నిర్మిస్తోంది.
ఇక ఇందులో మొదటిసారిగా త్రిష, సిమ్రాన్‌లు నటిస్తున్నారు. వరుస విజయాల మీద ఉన్న డిఫరెంట్ యంగ్‌స్టార్ విజయ్‌సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలో క్లైమాక్స్‌తో పాటు కొన్ని కొన్ని సీన్స్‌లో హింసను బాగా చూపించారట. దాంతో సెన్సార్‌వారు ఈ సీన్స్‌ని తీసివేస్తే క్లీన్‌యు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పినా రజనీ, సన్‌పిక్చర్స్ అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అయినా ప్రస్తుతం క్లీన్ యు వచ్చినా ఒరిగేది ఏమీ లేదు. పైగా రజనీ చిత్రం ‘యుబైఏ’ అంటే అందరిలో ఆసక్తి రేగడం కూడా ఖాయమనే చెప్పాలి...!