ఎంతోకాలం నుంచి సినీ రంగంలో వారసులకు తప్ప బయటివారికి సరైన ప్రోత్సాహం ఉండదనే విమర్శలు ఉన్నాయి. దీనికి మన ఘనత వహించిన సినీ ఫ్యామిలీలకు చెందిన వారు చెప్పే సమాధానం ఏమిటంటే.. వారసత్వం అనేది కామన్. రాజకీయ నాయకుల కుమారులు రాజకీయనాయకులు అవుతున్నారు.. అంబానీల వారసులు అంబానీలే అవుతున్నారు. చివరకు డాక్టర్ల వారసులు కూడా డాక్టర్లే అవుతున్నారు. అందులో తప్పేంటి? వారసత్వం వల్ల మా పిల్లలను మాకున్న అనుభవంతో గైడెన్స్ చేసే అవకాశం లభిస్తుంది. దీనిని ఎందుకు తప్పనుకోవాలి. కేవలం వారసత్వం వల్ల కెరీర్ మొదట్లో మంచి ఫ్టాట్‌ఫారం, ఒక సినిమా ఫ్లాప్ అయినా మరో రెండు మూడు అవకాశాలు వంటి సౌలభ్యాలు మాత్రమే ఉంటాయి. టాలెంట్ లేనిదే ఎవ్వరూ నిలదొక్కుకోలేరు అని చెబితే సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద తనయుడు రమేష్‌బాబు, నాగబాబు, సుమంత్, సుశాంత్ వంటి వారిని ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు.
కానీ ఎంత అందవిహీనుడైనా, హీరోకి కావాల్సిన మెటీరియల్ లేకపోయినా, గొంతు వంటివి సరిగా లేకపోయినా వరుసగా జనాలకు దానిని అలవాటు చేసేందుకు మాత్రం వారసత్వం ఖచ్చితంగా ఉపయోగపడుతుందనేది వాస్తవం. కానీ 2018 మాత్రం ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని ఇద్దరిని సెన్సేషనల్ స్టార్స్‌ని చేసి చేతల్లో చూపించింది. ఏ ముహూర్తాన విజయ్‌దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం చేశాడో గానీ ‘గీతాగోవిందం, ట్యాక్సీవాలా’ చిత్రాలతో ఇతను ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతూ మిగిలిన హీరోలకు చుక్కలు చూపిస్తున్నాడు. ‘అర్జున్‌రెడ్డి’ కంటే ముందుగా ‘పెళ్లిచూపులు’ నుంచే సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన ఈయన మద్యలో ‘నోటా’ వంటి చిత్రాలు చేసినా ప్రేక్షకులు వాటిని పట్టించుకోవడం లేదంటే పరిస్థితి అర్ధమవుతుంది. ‘గీతాగోవిందం’తో అతి తక్కువ చిత్రాలతో 100కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లాడు. అభిమానులు ఆయన్ను ముద్దుగా నైజాం మెగాస్టార్, పవర్‌స్టార్ అని పిలిచినా ఎవ్వరూ పెద్దగా అభ్యంతరం చెప్పడం లేదు. చిరంజీవి, అల్లుఅరవింద్ వంటి వారే నయా స్టార్ ఆవిర్భవించాడని కితాబునిచ్చారంటే పరిస్థితి అర్ధమవుతుంది.
ఇక ఈయనకు బాలీవుడ్‌లో కూడా కరణ్‌జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, యష్‌రాజ్ ఫిల్మ్స్ వంటి సంస్థలో హీరోగా చేసే అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఈమద్య కాలంలో ఇంత వడివడిగా ఎదిగిన స్టార్ లేడనేది నగ్నసత్యం. ఇక రెండో నటుడు కన్నడ హీరో అయిన యష్. ఈయన నటించిన ‘కెజీయఫ్’ చిత్రం ఈ వారంలోనే 100కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కోలార్ బంగారు గనులు, మాఫియా నేపధ్యంలో వచ్చిన ఈ చిత్రం డ్రైవర్ కుమారుడైన యష్‌ని కన్నడలోనే కాదు.. తమిళం, తెలుగు, చివరకు బాలీవుడ్‌లో కూడా స్టార్‌ని చేసింది. ఈ మూవీ షారుఖ్‌ఖాన్ ‘జీరో’ కలెక్షన్లను సైతం అధిగమించడం ఆశ్చర్యపరుస్తోంది. మొత్తానికి 2018 సినిమా రంగంలోకి ఎంటర్ కావాలనే నటీనటులకు గట్టి భరోసానే అందించిందని చెప్పాలి. ఈ స్ఫూర్తితో కార్తికేయ వంటి పలువురు ఎదిగితే అది అన్ని ఇండస్ట్రీలకు శుభపరిణామమనే చెప్పాలి.