తెలుగు యంగ్‌స్టార్స్ మొత్తం మెగా ఫ్యామిలీ హీరోలతో నిండిపోయారనే విమర్శ ఉంది. మెగాస్టార్ చిరంజీవిని అడ్డుపెట్టుకుని ప్రతివాడు హీరో అయిపోతున్నాడనే అపవాదుకి కాస్త బలం చేకూర్చిన ఏడాది 2018 అనే చెప్పాలి. కానీ మెగాభిమానులు, హీరోలు చెప్పేది మాత్రం భిన్నంగా ఉంటుంది. మార్కెట్ వాటాలో తమదే 60శాతానికి మించి ఉందని, తమ హీరోలు లేకపోతే తెలుగు సినీ పరిశ్రమ వెలవెలబోతుందనేది వారు చెప్పే వెర్షన్.
ఇక విషయానికి వస్తే 2018 మెగాహీరోలకు 75శాతంకు పైగా నిరాశనే మిగిల్చింది. ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా ఎన్నో అంచనాలతో విడుదలైన పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల హ్యాట్రిక్ మూవీ ‘అజ్ఞాతవాసి’పై వచ్చిన విమర్శలు ఈ మధ్యకాలంలో మరో చిత్రంపై వచ్చి ఉండవనేది నిజం. అసలు ఈ చిత్రానికి త్రివిక్రమే దర్శకత్వం వహించాడా? లేక పవన్ కనుసన్నలలోనే అన్ని జరిగాయా? కనీసం మాటలైనా మాటల మాంత్రికుడు రాశాడా? వంటి అపవాదుల మధ్య పవన్ కెరీర్‌లో బిగ్జెస్ట్ డిజాస్టర్‌గా ఈమూవీ నిలిచింది. ఇందులో ప్రేక్షకులను మెప్పించిన సీన్ ఒకటి కూడా లేదని మెగాభిమానులే పెదవి విరిచారంటే పరిస్థితి అర్ధమవుతుంది. మొదటిసారిగా ఈ అపవాదు నుంచి బయట పడటానికి త్రివిక్రమ్, యంగ్‌టైగర్‌ని వెంట పెట్టుకుని వచ్చాడు. ఇక ఈ మూవీ దెబ్బకి పవన్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాడు. ఇక ఈ మూవీ కాపీ వివాదమైతే మరింత అప్రతిష్టపాలు చేసింది.
కానీ ఆ తర్వాత మాత్రం మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ సుకుమార్‌తో కలిసి ‘రంగస్థలం’తో కనికట్టుచేసి, చరణ్‌లో ఇంత గొప్పనటుడు ఉన్నాడా? అని తండ్రినే కాదు.. అందరూ గర్వపడేలా చేశాడు. మెగాప్రిన్స్ నటించిన ‘తొలిప్రేమ’ మంచి విజయం సాధించింది. కానీ మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ నటించిన వినాయక్ ‘ఇంటెలిజెంట్, తేజు ఐ లవ్‌యు’ చిత్రాలు ఘోరపరాజయం పాలైయ్యాయి. బన్నీ నటించిన ‘నాపేరు సూర్య-నా ఇల్లు ఇండియా’ గురించి, మరీ ముఖ్యంగా అల్లుశిరీష్ గురించి చెప్పడానికి ఏమీ లేదనే అనాలి. ఇవ్వన్నీ ఒక ఎత్తైతే మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కనీసం హీరోకి కావాల్సిన ఏ లక్షణాలు లేకుండా చిరంజీవి బ్లాక్‌బస్టర్ ‘విజేత’తో ప్రేక్షకులను చిత్ర హింసలు పెట్టాడు. ఈ ఏడాది చివరలో వచ్చిన వరుణ్‌తేజ్ ‘అంతరిక్షం’కి మంచి ప్రయత్నంగా ప్రశంసలు లభించినా, కమర్షియల్‌గా దెబ్బ తప్పలేదు. ఇక 2019ని మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’తో మొదలుపెడుతున్నాడు. మరి రాబోయే ఏడాదిలో మెగాహీరోల చిత్రాలు వస్తాయి? రాశిలో కన్నా వాసిలో ఏవి గట్టిగా నిలబడతాయో వేచిచూడాల్సివుంది...!