ఏమాటకామాటే చెప్పుకోవాలి గానీ తమిళులకు, కన్నడిగులకు ఉన్నంత భాషాభిమానం మన తెలుగు వారికి లేదు. మరీ ముఖ్యంగా కన్నడిగుల విషయానికి వస్తే ఇంతకాలం వారి మార్కెట్ పరిధి, సినిమాల బడ్జెట్, కలెక్షన్లు వంటివి చాలా తక్కువగా ఉండేవి. దాంతో పరభాషలకి చెందిన చిత్రాలు డబ్ అయిన తమ రాష్ట్రంలో విడుదలైతే తమ సొంత భాషా చిత్రాలకు కలెక్షన్లు కాదు.. చివరకు థియేటర్లు కూడా దొరకవని వారి నిశ్చితాభిప్రాయం.
దాంతో ఏ భాషా చిత్రాన్నైనా కన్నడలో డబ్ చేయడానికి అవకాశం లేదని, కావాలంటే అదే భాషల్లో విడుదల చేయమని వారు నిబంధనలు విధిస్తూ వచ్చారు. దాంతో ఇతర భాషా చిత్రాలు మాతృభాషల్లోనే విడుదలయ్యేవి. ఇక కన్నడ నాట తెలుగు చిత్రాలను ఇష్టపడే వారు, ప్రేమించే వారికి కొదువ ఉండదు. మెగాహీరోలతో పాటు ఇతర స్టార్ హీరోలకు కూడా కర్ణాటకలో మరీ ముఖ్యంగా రాజధాని బెంగుళూరులో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది.
కానీ డబ్బింగ్ నిబంధన వల్ల ఇప్పటివరకు చాలా కోల్పోయాం. ఈ నినాదంపై కన్నడలో ఉద్యమాలు చేయడం, చివరకు డబ్బింగ్ చిత్రాలను బ్యాన్ చేయడంలో నాటి కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ నుంచి నేటితరం నటీనటుల వరకు ఓకే తాటిపైకి వచ్చారు. కానీ కన్నడ చిత్రాలను మాత్రం ఇక్కడ, ఇతర భాషల్లో బాగానే డబ్ చేస్తున్నారు. ఈ ఉద్యమం సమయంలో మన తెలుగు వారు మాత్రం కన్నడ హీరోయిన్లు, ఇతర నటీనటులను పిలిచి మరీ మనవారికి కాకుండా కన్నడ నటీనటులకు చాన్స్‌లు ఇవ్వడాన్ని పలువురు ఖండించారు.
ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రేమతో పాటు పలువురు హీరోయిన్లని తెలుగు తెరపైకి తెచ్చిపెట్టారు. ఈ విషయంలో ఉపేంద్ర చిత్రాల నుంచి తాజాగా యష్ హీరోగా వచ్చిన ‘కెజియఫ్’ వరకు చాంతాడంత లిస్ట్ ఉంది. కానీ పోటీ ఉంటేనే కన్నడ పరిశ్రమలో కూడా మంచి క్వాలిటీ చిత్రాలు వస్తాయనే విషయాన్ని వారు విస్మరించారు. నాటి ఉద్యమంలో తన వారసుల కోసం రాజ్‌కుమార్ పాల్గొన్నా కూడా తెలుగులో నాటి ఏయన్నార్ నుంచి ఎవ్వరూ దీనిపై స్పందించకపోవడం బాధాకరమైన విషయమే.
అయితే అఫీషియల్‌గా ప్రకటించలేదు గానీ ప్రస్తుతం పలు హాలీవుడ్ చిత్రాలతో పాటు ఇతర భాషా చిత్రాలు కూడా ఒక్కొక్కటిగా డబ్ అవుతున్నాయి. తాజాగా కర్ణాటకతో అవినాభావ సంబంధం ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేటా’ చిత్రం జనవరి 10నే కన్నడలో కూడా డబ్ అయి విడుదల కానుంది. కేవలం తమిళంలోనే విడుదలైన ‘2.ఓ’ కన్నడనాట 50కోట్లు వసూలు చేయడంతో ‘పేటా’ చిత్రం డబ్బింగ్ అవుతుంది కాబట్టి ఎంతగా అక్కడి కలెక్షన్లను దోచుకుంటుందో చూడాలి.
ఇదే జరిగితే రాబోయే తెలుగు చిత్రాల డబ్బింగ్ వెర్షన్స్ కూడా కన్నడ నాట భారీ కలెక్షన్లు సాధించడం ఖాయం. ఇది శుభపరిణామమనే చెప్పాలి.