ఇకపై క్రేజీ హీరోయిన్ అనుష్కకు కనపడదు...వినపడదు అని తెలిసింది. అది నిజజీవితంలో కాదండోయ్...సినిమాలో.. `బాహుబలి` చిత్రానికి అత్యధిక డేట్స్ కేటాయించి దేవసేన పాత్రలో ఆకట్టుకున్న అనుష్క ఆ తరువాత `భాగమతి`గా భయపెట్టి కలెక్షన్‌లని కొల్లగొట్టిన విషయం తెలిసిందే. లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి తరువాత ఆ స్థాయి పాత్రలకు పెట్టింది పేరుగా కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అనుష్క కొంత విరామం తరువాత మళ్లీ తన సత్తా చూపించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కథానాయికగా తన సత్తా ఏంటో `అరుంథతి`, `భాగమతి` వంటి మహిళా ప్రధాన చిత్రాలతో నిరూపించిన అనుష్క త్వరలో మరో మహిళా ప్రధాన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
`సైజ్ జీరో` సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క ఆ కారణంగా కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా వుంటూ వస్తోంది. బరువు తగ్గడం కోసం ఆమె కసరత్తులు చేస్తోందని, గౌతమ్ మీనన్ రూపొందించనున్న ద్విభాషా చిత్రాన్ని అంగీకరించిందని, కరణ్ జోహార్ సినిమాతో బాలీవుడ్‌కు వెళుతోందంటూ రకరకాల వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే అవన్నీ వట్టి గాలి వార్తలే అని తేలడం.. ఆ తరువాత అనుష్క కొంత బరువు తగ్గడంతో మళ్లీ సినిమాలను అంగీకరించడం మొదలుపెట్టింది. తాజాగా కోన వెంకట్ చెప్పిన కథ నచ్చడం, అందులో తన పాత్ర ఛాలెంజింగ్‌గా వుండటంతో మాధవనన్ కీలక పాత్రలో నటించనున్న ఓ చిత్రాన్ని అనుష్క అంగీకరించింది.
ఇందులో ఆమె పాత్ర ప్రయోగాత్మకంగా సాగుతుందట. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించనున్న ఈ సినిమాలో అనుష్క పాత్రకు కనబడదు..వినబడదంట. అందుకే ఈ చిత్రానికి `సైలెంట్` అనే టైటిల్‌ను కోన వెంకట్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. తొలిసారి ప్రయోగాత్మ పాత్రలో కనిపించనున్న అనుష్క ఈ సినిమాతో ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తుందో.. ఏ రేంజ్‌లో విమర్శకుల్ని మెప్పిస్తుందో చూడాలి. ప్రయోగాత్మక కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రం జనవరి నుంచి సెట్స్‌పైకి రానుంది.