ఓ టీవీ ఛానల్ కోసం తన కెరీర్‌నే పణంగా పెట్టి బొక్కబోర్లా పడ్డాడు యాంకర్ ప్రదీప్. తనకున్న క్రేజ్‌ను వాడుకోవాలని ప్రయత్నించిన ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ ప్రదీప్‌తో ఏకంగా `పెళ్లిచూపులు` పేరుతో ఓ రియాలిటీ షోనే ప్లాన్ చేసింది. ముందు ఇది నిజంగా ప్రదీప్ స్వయంవరం కోసం చేస్తున్న హంగామానే అనేంతగా భ్రమకల్పించిన సదరు ఛానల్ వాళ్లు ఈ కార్యక్రమం కోసం ఏకంగా భారీ సెట్టింగులు వేయించి భారీగానే ఖర్చు చేశారు. ఎపిసోడ్స్ గడుస్తున్నా కొద్దీ కార్యక్రమం గతితప్పడం...ప్రదీప్‌పై బయట కొంత మంది మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో అర్థాంతరంగానే ఈ కార్యక్రమాన్ని మమా అనిపించేశారు.
దీని తరువాత కనిపించకుండా పోయిన ప్రదీప్ మళ్లీ తెర ముందుకు రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వేతుక్కోవాలి అన్నట్టు తన ఫేమ్‌ని పోగొట్టుకున్న చోటే మళ్లీ వెతుక్కోవాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రదీప్ ఈ సారి బుల్లి తెరను కాకుండా వెండితెరను నమ్ముకుంటున్నాడు. గతంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్న ప్రదీప్ ఈ సారి ఏకంగా హీరోగా అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఓ పేరున్న నిర్మాణ సంస్థ ప్రదీప్‌ని హీరోగా పరిచయం చేస్తూ రొమాంటిక్ లవ్‌స్టోరీని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నారు. స్వయంకృతం వల్ల యాంకర్‌గా తన పాపులారిటీకి తానే మంగళం పాడుకున్న ప్రదీప్ ఈ సినిమాతో హీరోగా నిలబడాలనుకుంటున్నాడట. కొత్త తరహా సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్న వేళ నటుడిగా తన సత్తా ఏంటో నిరూపించుకుని హీరోగా మంచి మార్కులు కొట్టేయాలనుకుంటున్నాడట. మరి ప్రదీప్ ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో..తను హీరోగా ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో తెలియాలంటే అతని తొలి సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.