తాజాగా ‘పేట’ ప్రీరిలీజ్ వేడుకలో నిర్మాతల మండలి మాజీ ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న, ‘పేట’ని తెలుగులో విడుదల చేస్తున్న వల్లభనేని అశోక్‌లు చిత్రానికి థియేటర్లు దొరకడం లేదని, నయింని కాదు చంపాల్సింది.. ఇండస్ట్రీ మాఫియాకి సంబంధించిన ఆ నలుగురిని షూట్ చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై ‘గీతాఆర్ట్స్ 2’నిర్మాణ వ్యవహారాలను చూస్తోన్న బన్నీవాస్ పెద్ద స్థాయిలోనే కౌంటర్ ఇచ్చాడు.
సంస్కారం మరిచి, గీత దాటితే తాము కూడా తీవ్ర విమర్శలు చేయగలమని చెబుతూ, డైరెక్ట్‌గా ప్రసన్న పేరును తెలియజేస్తూ మెసేజ్‌లు పెట్టాడు. విమర్శలు హద్దులు దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడు. ఇదే సమయంలో తాజాగా దిల్‌రాజు కూడా ఎదురు దాడి మొదలుపెట్టాడు.
ఎవరెవరో ఏదేదో అడ్డదిడ్డంగా మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగులో విడుదల అవుతున్న స్ట్రెయిట్ చిత్రాలైన ‘వినయ విధేయ రామ, కథానాయకుడు, ఎఫ్ 2’ చిత్రాల విడుదల తేదీని ఏకంగా ఆరు నెలల ముందే నిర్ణయించాం. రిలీజ్‌కి మరో పదిపదిహేను రోజులు ఉన్నాయనగా, ఓ సినిమా డబ్బింగ్‌రైట్స్‌ని కొని థియేటర్లు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇదే నిర్మాత విడుదల చేసిన ‘నవాబ్, సర్కార్’లకు కావాల్సినన్ని థియేటర్లు లభించాయి. అవి మరిస్తే ఎలా?
అసలు సంక్రాంతికి తెలుగు స్ట్రెయిట్ చిత్రాలకే థియేటర్లు దొరకవు. అప్పటికీ ఈ మూడు చిత్రాల విషయంలో థియేటర్ల పరంగా మేము మంచి అండర్‌స్టాండింగ్‌తో వెళ్తున్నాం. ఈ విషయాన్ని అందరు గమనిస్తున్నారు.. అంటూ కౌంటర్ ఇచ్చాడు. మరోవైపు రజనీ అమెరికాలో ఉండి ‘పేట’ తెలుగు ప్రీరిలీజ్ వేడుకలకు హాజరుకాలేదు గానీ ఆయన వచ్చి ఉంటే కూడా ప్రసన్న, వల్లభనేని అశోక్‌ల మాటలను ఖండించేవారని అందరు అభిప్రాయపడుతున్నారు.
ఇక ‘పేట’ చిత్రం ఈనెల 18వ తేదీ నుంచి ప్రతి థియేటర్‌లోనూ ఉంటుందని, మిగిలిన సినిమాలేవీ నాటికి ఉండవని వల్లభనేని అశోక్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. మరి 18వ తేదీ నుంచి ‘పేట’నే థియేటర్లలో ఉంటుందనే నమ్మకం ఉంటే, ఆ చిత్రాన్ని హాయిగా 18నే విడుదల చేయవచ్చు కదా! అంటూ దిల్‌రాజు పేల్చిన సెటైర్ మాత్రం నిజమేనని చెప్పాలి.