దేశం మొత్తం, అన్ని సినీ పరిశ్రమలు ప్రస్తుతం ఒకనాటిలా కోలీవుడ్ వైపు కాకుండా టాలీవుడ్ వైపు చూస్తున్నాయనే విషయం నిర్వివాదాంశం. ఒకనాడు దక్షిణాది చిత్ర పరిశ్రమ అంటే తమిళం అనే భ్రమలో బిటౌన్ వర్గాలు ఉండేవి. ఇక కొన్ని మలయాళ చిత్రాలు కూడా అందరినీ ఆకట్టుకునేవి. అలాంటి చిత్రాలు తెలుగులో ఎందుకు రావు? అనే ధర్మసందేహం అందరిలో ఉండేది. ‘దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్’ వంటి చిత్రాలు తెలుగులో వస్తాయా? అనే ఆశను కూడా పలువురు వదులుకున్నారు.
అయితే ‘బాహుబలి’ చిత్రం వాటన్నింటిని చెరిపివేసి సరికొత్త చరిత్రను లిఖించింది. ‘బాహుబలి’ తర్వాత ఆ రేంజ్ చిత్రం అంటూ ప్రచారం జరిగిన ఏ భాషా చిత్రం దానికి ధీటుగా నిలబడలేకపోయింది. చివరకు శంకర్-రజనీ-అక్షయ్‌కుమార్‌ల ‘2.0’ సైతం గ్రాఫిక్స్ హంగులు, భారీతనమే తప్ప ‘బాహుబలి’లోని ఎమోషన్స్‌ని మిస్ అయింది. ‘మహానటి, రంగస్థలం, అర్జున్‌రెడ్డి’ ఇలా పలు చిత్రాలు అన్ని పరిశ్రమలను ఆకర్షిస్తున్నాయి.
‘బాహుబలి’ కమర్షియల్ చిత్రమే అయినా సరికొత్తగా చిత్రాన్ని ప్రజెంట్ చేసిన తీరు అద్భుతమే అని చెప్పాలి. మరోవైపు మనం రొంపకొట్టుడు మాస్, యాక్షన్ చిత్రాలుగా భావించే వాటిని కూడా ఇతర భాషల వారు మరీ ముఖ్యంగా మలయాళీ, బాలీవుడ్ వారు సోషల్ మీడియా వేదికగా కోట్ల మంది వీక్షిస్తూ ఉన్నారు. ఇక విషయానికి వస్తే గత ఏడాది బాలీవుడ్‌లో పెద్ద పెద్ద చిత్రాలనిపించినవన్నీ తుస్సుమన్నాయి. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, జీరో’ వంటి చిత్రాలు దానికి సాక్షీభూతంగా నిలిచాయి.
ఇక తెలుగులో వరుస ఫ్లాప్‌లలో ఉన్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కి, పూరీకి లభించిన విజయంగా ‘టెంపర్’ని చెప్పాలి. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌ని మరలా గాడిలో పెట్టింది. దీనికి రీమేక్‌గా బాలీవుడ్‌లో విడుదలైన రణవీర్‌సింగ్ నటించిన ‘సింబా’ చిత్రం దాదాపు 200కోట్ల వసూళ్లకు దగ్గరలో ఉంది. ఇది నిజంగా తెలుగు సినిమాకి, ఎన్టీఆర్, పూరీ, వక్కంతం వంశీ వంటి వారి ఘనతగానే చెప్పాలి.
ఇక రాబోయే ‘ఆర్.ఆర్.ఆర్’, ‘సై..రా..నరసింహారెడ్డి’ తో పాటు ఎన్టీఆర్ బయోపిక్, కంగనా రౌనత్ నటించి రిపబ్లిక్‌డే కానుకగా విడుదల కానున్న ‘మణికర్ణిక’లో సైతం క్రిష్, విజయేంద్రప్రసాద్‌లు భాగస్వామ్యం కావడం తెలుగువారు గర్వించే విషయమనే చెప్పాలి.