ఏ ఫీల్డ్‌లో అయినా కెరీర్ ప్రారంభంలో అనుభవరాహిత్యం, బాగా అనుభవం సంపాదించిన తర్వాత వెలలేని విజ్ఞానం వస్తాయి. కానీ ఇది సినీ దర్శకుల వంటి క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉండే వారికి వర్తిస్తుందా? లేదా? అనే మీమాంస ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే తరాలు మారిన తర్వాత నేటితరం పల్స్‌ని పట్టుకోవడం బాగా అనుభవం ఉన్న వారికైనా అసాధ్యమేనా? కొత్తతరం వారే కొత్త జనరేషన్ వారిని మెప్పించగలరా? అనే అనుమానాలు ఉంటాయి. దీనికి ఉదాహరణగా ఎందరినో చెప్పవచ్చు. మన కళ్ల ముందు కనిపించిన బాపు, కె.విశ్వనాథ్, దాసరినారాయణరావు, కోదండరామిరెడ్డి, కోడిరామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, రాఘవేంద్రరావులతో పాటు కోలీవుడ్‌కి చెందిన సురేష్‌కృష్ణ, కె.యస్.రవికుమార్, పి.వాసు వంటి ఎందరో ఉద్దండులు సీనియర్స్‌గా మారిన తర్వాత ఆ స్థాయి చిత్రాలను తీయలేకపోయారు.. పోతున్నారు. ఈ విషయంలో మణిరత్నం నుంచి కృష్ణవంశీ వరకు ఎందరినో ఉదాహరణగా చూపవచ్చు.
ఇక క్రియేటివ్ జీనియస్‌గా పేరొందిన మణిరత్నంలో నాటి స్పార్క్ పోయిందనే విమర్శలు ఎప్పటినుంచో వస్తున్నాయి. ‘ఒకే బంగారం’, ‘నవాబ్’వంటివి ఓకే అనిపించినా అందులో మణి మ్యాజిక్, ముద్ర కనిపించలేదు. అయినా కూడా మణి మరోసారి మరోసాహసానికి తెరతీస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో రాజమౌళి తీర్చిదిద్దిన కళాఖండం ‘బాహుబలి’ని మించి సినిమాలను తీయాలని భావించిన ఏ భాషా చిత్రం కూడా దాని దరిదాపుల్లోకి రాకుండా పోయింది. చివరకు ‘2.ఓ’ కూడా ఆ స్థాయిలో మెప్పించలేదు. ‘సైరా..నరసింహారెడ్డి’కి 250కోట్లకు పైగా ఖర్చుపెడుతూ, ‘బాహుబలి’ రేంజ్ బడ్జెట్, మార్కెట్ ఉన్న చిత్రం అని అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మణిరత్నం ‘బాహుబలి’ స్థాయి చిత్రం తీసేందుకు నడుం బిగిస్తున్నాడట. తమిళ, తెలుగు, హిందీ భాషలతో పాటు దాదాపు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్న ఈ మూవీలో బిగ్‌బి అమితాబ్‌బచ్చన్ ‘బాహుబలి’లో కట్టప్ప వంటి పాత్రను చేస్తాడని, ఆయన కోడలు ఐశ్వర్యారాయ్ హీరోయిన్‌గా ప్రధానపాత్రను పోషిస్తుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ మూవీని కల్కి కృష్ణమూర్తి రచించిన చారిత్రాత్మక నవల ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా రూపొందిస్తారని సమాచారం.
ఐదు భాగాలుగా వచ్చిన ఈ నవలను మూడు భాగాలుగా మణిరత్నం తీయనున్నాడని, ఇందులో అన్ని భాషల స్టార్స్ నటించేందుకు మణి ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. మరి ఇది ప్రస్తుత పరిస్థితుల్లో మణి చేస్తోన్న హెవీ రిస్క్ అనే చెప్పాలి. ఇంతకీ ఈ మూవీకి అంత బడ్జెట్ కేటాయించే నిర్మాతలు ఎవరు? మణినే మద్రాస్ టాకీస్ ద్వారా నిర్మిస్తాడా? వంటి విషయాలలో త్వరలోనే ఓ క్లారిటీ, అధికార ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.