తెలుగులో హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించే విషయంలో ఎలాంటి లాజిక్కులకు దొరకకుండా ఏది పడితే అది తీసి దానినే హీరోయిజం అనిపించే చిత్రాలు ఎక్కువగా చేసిన స్టార్‌గా నందమూరి నటసింహం బాలకృష్ణకు పేరుంది. పర్వతాలు ఎక్కి కుందేలును పట్టడం, కంటి చూపుతో రైలుని వెనక్కి పంపేయడం, తొడగొడితే భూకంపం రావడం, కాళ్లకు పాలిథిన్ కవర్లు కట్టుకుని ప్యారాచూట్‌లా దూసుకుపోయే సూపర్‌మ్యాన్ తరహా సీన్స్ బాలయ్య సినిమాలలో మస్తుగా ఉంటాయి.
ఇదే విషయంపై ఓ సారి బాలయ్య స్పందిస్తూ, అవి లాజిక్ కాదని అర్దమైనా దర్శకులు చెప్పింది చేసే వాడినని చెప్పి నవ్వేశాడు. ఇప్పుడు వినయ విధేయ రామతో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ వంతు వచ్చింది. ఈ చిత్రంలోని ట్రైన్ సీన్‌పై జోక్స్ పేలుతున్నాయి. జంజీర్, ఆరెంజ్, బ్రూస్‌లీలను మించిన చిత్రం ఇచ్చాడని రామ్‌చరణ్‌ని, బోయపాటిని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు.
ఇక ఈ విషయంలో రామ్‌చరణ్, చిరంజీవి, మెగా కాంపౌండ్ వారు ఇలాంటి సీన్స్ విని ఓకే చేశారా? లేక పవర్‌ఫుల్ మాస్ డైరెక్టర్‌గా బోయపాటి శ్రీనుపై ఉన్న నమ్మకంతో ముందు వెనుకా ఆలోచించకుండా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా? అనే వాదన నడుస్తోంది. రామ్‌చరణ్ మాత్రం తాను దర్శకుడు చెప్పింది చేశానని, ఈ సీన్స్ అవుట్‌పుట్‌లో తనదేమీ ప్రమేయం లేదని తప్పునంతా బోయపాటి మీదకు నెట్టేలా మాట్లాడుతున్నాడు. దర్శకుడు చెప్పింది చేయడం మంచి పద్దతే అయినా కూడా ముందుగా సీన్ టు సీన్ కూడా వినకుండా చేయడం వల్లనే ఈ దుస్థితి వచ్చిందనే వాదన ఉంది.
ఇప్పుడు సినిమా ఫలితం ఇలా వచ్చేసరికి చరణ్ బోయపాటి మీద, చరణ్ ఒప్పుకున్నాడు కాబట్టే ఇలాంటి సీన్స్ తీశానని బోయపాటి... చరణ్ మీద తప్పులను నెట్టుకోవడం వల్ల వచ్చే లాభం ఏమి ఉండదు. మొత్తానికి రాబోయే కాలంలో మాస్ హీరోలైనా, స్టార్ హీరోలైనా, ఎంత క్రేజ్, ఇమేజ్ ఉన్న వారైనా ఇలా నేల విడిచి సాము చేయకూడదనే గుణపాఠాన్ని వినయ విధేయ రామ తెలియజెప్పింది. రాబోయే కాలంలో ఈ చిత్రం మరో దశాబ్దంపాటు మాస్ సినిమాలను ఎలా తీయకూడదు? ప్రేక్షకులు వైవిధ్యభరితమైన చిత్రాలను ఆదరిస్తున్న తరుణంలో ఎలాంటి చిత్రాలు చేయాలి? అనే విషయాలలో ఓ గుణపాఠంగా నిలుస్తుందనే చెప్పాలి.