రానాతో నటించిన హీరోయిన్ల పెళ్లిళ్లు మాత్రం జరుగుతున్నాయి కానీ దగ్గుబాటి వారసుడి పెళ్లి ఎప్పుడో మాత్రం తెలియడం లేదు. ఇక రానా హీరోగా శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో లీడర్ ద్వారా పరిచయం అయిన సంగతి తెలిసిందే. కొత్త కొత్త హీరోయిన్లను పరిచయం చేయడంలో ముందుండే శేఖర్‌కమ్ముల ఈ మూవీ ద్వారా రానాకి జోడీగా రిచా గంగోపాధ్యాయని పరిచయం చేశాడు. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. కానీ ఆమె మాత్రం వెంకటేష్ నటించిన నాగవల్లి, రవితేజ సరసన మిరపకాయ్, సారొచ్చారు, ప్రభాస్ నటించిన మిర్చి, నాగార్జున భాయ్ తదితర చిత్రాలలో నటించింది.
మిర్చి చిత్రం ద్వారా ఈమె ఐటం సాంగ్ చేస్తే సినిమా సూపర్‌హిట్ అవుతుందనే పేరును సంపాదించింది. ఆ తర్వాత మాత్రం ఈమె సినిమాలకు సడన్‌గా బ్రేక్‌నిచ్చింది. తాను మధ్యలో వదిలిపెట్టిన చదువును పూర్తి చేసేందుకు ప్రస్తుతం యూఎస్‌లో ఉంటోంది. మిచ్‌గాన్ యూనివర్శిటీలో చదువు కొనసాగిస్తున్న ఈమె మనసు ఎందుకో గానీ వెలుగు జిలుగుల వెండితెరపై నటి వైపు కాకుండా పెళ్లి వైపు మరలింది. తన విదేశీ బాయ్‌ఫ్రెండ్, క్లాస్‌మేట్ జోనిని ఆమె వివాహం చేసుకోనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తెలియజేయడం విశేషం.
తాజాగా తనకు కాబోయే భర్త జోతో కలిసి తాను తీసుకున్న ఫొటోలను సోషల్‌మీడియాలో పెట్టి, పెళ్లి సంగతిని అఫీషియల్‌గా అనౌన్స్ చేసి పారేసింది. నా అభిమానులకు ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నాకు జోతో నిశ్చితార్ధం కూడా పూర్తయింది. నేను, జో బిజినెస్ స్కూల్‌లో కలిశాం. ఈ రెండేళ్లు ప్రతి క్షణం ఆస్వాదించాను. ఈ రోజులు ఎంతో అద్భుతంగా గడిచిపోయాయి. నా జీవితంలో త్వరలో కొత్త దశలోకి అడుగుపెడుతున్నాను. పెళ్లి తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అయిన వెంటనే ఆ విషయాన్ని కూడా మీతో ఆనందంగా పంచుకుంటాను.. అని తెలిపింది.
అయితే ఇకపై సినిమాలలో నటించే ఆసక్తి మాత్రం లేదని తేల్చిచెప్పింది. అయినా ఇలా చెప్పిన పలువురు పెళ్లయి పిల్లల బాధ్యతలు పూర్తయిన తర్వాత మరలా నటించడం మొదలుపెట్టినవారే.. అయినా కోట్లలో ఒకరికి కూడా రాని హీరోయిన్‌స్టేటస్ వచ్చినా ఈమె కాళ్లదన్నుకుని చదువు, పెళ్లి అంటూ వెళ్లడం కాస్త ఆశ్చర్యకరమనే చెప్పాలి.