‘బ్రహ్మోత్సవం, స్పైడర్’ వంటి డిజాస్టర్స్ తర్వాత మహేష్‌బాబు ‘భరత్ అనే నేను’తో అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు. ప్రస్తుతం ఆయన తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా ‘మహర్షి’ చిత్రం చేస్తున్నాడు. వంశీపైడిపల్లితో ముగ్గురు అగ్రనిర్మాతలైన దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపిలు దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండటం విశేషం, శివరాత్రి కానుకగా ఈ చిత్రం ప్రమోషన్స్‌లో వేగం పెంచనున్నారు. మొదట ఏప్రిల్5న విడుదల చేయాలని భావించినా ఆ తర్వాత ఏప్రిల్ 26 శుక్రవారం విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి.
కానీ రెండు రోజులు ముందుగానే అంటే ఏప్రిల్ 24న బుధవారమే సినిమాని రిలీజ్ చేస్తే వరుసగా నాలుగైదు రోజుల ఓపెనింగ్స్‌ని భారీగా కొల్లగొట్టవచ్చని నిర్మాతలు భావిస్తున్నారు. ఇది ‘మహర్షి’ చిత్రంపై యూనిట్‌కి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. ఇందులో ఎన్నారైగా ఉండి ఇండియాకి వచ్చి స్నేహితుడు అల్లరినరేష్‌ని ఆదుకుని, వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే సందేశాత్మక కథాంశంతోనే ఈ మూవీ రూపొందుతోందని సమాచారం. ఇందులో రైతుగా ట్రాక్టర్ తోలుతూ మహేష్ కనిపించే సీన్స్ అభిమానులలో జోష్‌ని నింపుతాయని తెలుస్తోంది.
ఇక మహేష్ 26వ చిత్రంగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. సుక్కు చెప్పిన కొన్ని కథలను రిజెక్ట్ చేసిన ఆయన మరోసారి 1(నేనొక్కడినే) ఫలితం దృష్ట్యా పూర్తి కమర్షియల్ అంశాలతో కూడిన వైవిధ్యమైన కథకు ఓకే చేశాడట. దీని తర్వాత కామెడీ కోసం గతంలో శ్రీనువైట్లను నమ్మిన మహేష్ ఈసారి ‘పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2’ వంటి చిత్రాలతో కెరీర్ కాస్త డల్‌గా ఉన్న హీరోలకు సూపర్‌హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడికి, మొదటి చిత్రం ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. అనిల్ చిత్రం పూర్తి ఎంటర్‌టైనర్‌గా రూపొందనుండగా, సైకో థ్రిల్లర్‌లో నటించిన మహేష్‌ను పూర్తి క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్ ద్వారా సందీప్‌రెడ్డి వంగా సరికొత్త జోనర్‌తో చూపించనున్నాడని సమాచారం.
అభిమానులకు మరింత ఆనందం కలిగించే విషయం ఏమిటంటే ‘మహర్షి’ చిత్రంలో కాస్త గడ్డం, మీసాలతో కనిపించనున్న మహేష్‌ని సుకుమార్ తన చిత్రంలో డిఫరెంట్ లుక్‌తో చూపించనున్నాడని తెలుస్తోంది. ‘నాన్నకు ప్రేమతో, రంగస్థలం’ చిత్రాలలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను గుబురు గడ్డంతో చూపిన సుక్కు మహేష్‌ని ఎలాంటి కొత్త లుక్‌తో చూపించనున్నాడనే ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.