సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ‘సాయి’ భ్రమల్లో బతుకుతుంటాడు. పగటి కలలు ఎక్కువ కంటున్నాడని కంపెనీ అతణ్ణి ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటే... ఓ సమస్య ఎదురవుతుంది. మూడు రోజుల్లో ఓ దొంగను పట్టుకుంటేనే పెళ్లి జరుగుతుంది. పట్టుకోలేదంటే పెళ్లి జరగదు. అటువంటి సందర్భంలో తన స్నేహితుడు జానీతో కలిసి దొంగను పట్టుకోవడానికి సాయి బయలుదేరతాడు. ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సమస్యలేంటి? సాయి దొంగను పట్టుకున్నాడా? లేదా? అసలు, ఆ దొంగ ఎవరు? సాయి పెళ్లి జరిగిందా? లేదా? ఫిబ్రవరి 22న విడుదలవుతున్న మా చిత్రం చూసి తెలుసుకోమంటున్నారు దర్శకుడు ప్రశాంత్ కుమార్.
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించిన డార్క్ కామెడీ చిత్రం ‘మిఠాయి’. డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మాత. ఫిబ్రవరి 22 న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం టీజర్ విడుదల చేశారు.
నిర్మాత ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ ‘‘ఇద్దరు స్నేహితుల నేపథ్యంలో నడిచే చిత్రమిది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. సాయిగా రాహుల్ రామకృష్ణ బాగా నటించారు. ఫిబ్రవరి 22న ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని అన్నారు.
కమల్ కామరాజు, భూషణ్ కల్యాణ్, రవి వర్మ, అజయ్ ఘోష్, అర్ష, శ్వేతా వర్మ, అదితి మ్యాకల్, విజయ్ మరార్, గాయత్రి గుప్తా ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రవివర్మన్ నీలమేఘం, సంగీతం: వివేక్ సాగర్, ఎడిటర్: గ్యారీ బి.హెచ్, సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, మాటలు: ప్రశాంత్ కుమార్, బి. నరేష్, నిర్మాత: డాక్టర్ ప్రభాత్ కుమార్, దర్శకత్వం: ప్రశాంత్ కుమార్.