మరి పరిణితి చోప్రా అలా పబ్లిసిటీ చేయించుకుంటుందో లేక మనవాళ్లే ఆమె కావాలని అలా చేస్తారో తెలియదు కానీ.. తెలుగులో ఏదైనా ఒక పెద్ద సినిమా ఎనౌన్స్ అయ్యిందంటే చాలు ముందుగా వినిపించే హీరోయిన్ పేరు పరిణీతి చోప్రా. ప్రియాంక చోప్రా చెల్లెలు అయిన ఈ అమ్మడు పలుమార్లు హైద్రాబాద్ వచ్చినప్పుడు తాను తెలుగు సినిమాల్లో నటించాలనుకొంటున్నాను అని చెప్పడమే కాక మహేష్ బాబుతో నటించాలనుకుంటున్నాని అని కూడా పరిణీతి పలుమార్లు చెప్పింది. అందుకేనేమో.. మహేష్ స్పైడర్, చిరంజీవి ఖైదీ నెం.150, చరణ్ వినయ విధేయ రామ, ఇప్పుడు తాజాగా ఆర్.ఆర్.ఆర్ లోనూ హీరోయిన్ గా మొదట పరిణీతి చోప్రా పేరే వినిపిస్తోంది.
నిజానికి పరిణీతిని కనీసం ఎవరూ సంప్రదించి కూడా ఉండరు. కానీ.. హీరోయిన్ గా మాత్రం ఆమె పేరు వినిపించడం మాత్రం షరామమూలు అయిపోయింది. ఇది పరిణీతి చోప్రా పి.ఆర్ టీం ప్లాన్ అని కొందరు అంటుంటే.. ఇంకొందరు మాత్రం పరిణీతి కావాలనే ఇలా ప్రచారం చేయిస్తుంది అంటున్నారు. పరిణీతి లాంటి టాలెంటెడ్ హీరోయిన్ తెలుగు తెరకు పరిచయమవ్వడం మంచిదే కానీ.. ఇలా ప్రతిసారి ఆమె నామజపం చేయడం అనేది కూడా సరైనది కాదు అనేది అర్ధం చేసుకోవాలి.
అయినా.. మూడో షెడ్యూల్ వరకూ హీరోయిన్స్ కి సినిమాలో స్కోప్ లేదని, సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక హీరోయిన్ ను వెతకడం మొదలెడతామని రాజమౌళి చెప్పిన తర్వాత కూడా కొన్ని మీడియా కంపెనీస్ రాజమౌళి కంటే ఎక్కువగా హీరోయిన్ కోసం వెతుకుతుండడం హాస్యాస్పదంగా మారింది.