అక్కినేని నాగార్జున తన కెరీర్ విషయంలోనే కాదు.. తన పిల్లల కెరీర్‌లను కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. తన కెరీర్, బిజినెస్‌లతో పాటు బాధ్యత కలిగిన తండ్రిగా ఆయన ప్రత్యేక సమయం కేటాయిస్తాడు. ఇందులో భాగంగా పెద్దకుమారుడు నాగచైతన్యని క్లాస్ హీరోగా, అఖిల్‌ని మాస్ హీరోగా నిలబెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. అదే సమయంలో కుమారులకు కేవలం సలహాలు ఇస్తాడే గానీ మిగిలిన విషయాలలో వారికి పూర్తి స్వేచ్చని ఇస్తాడు. అయితే నాగార్జున ఇప్పటి వరకు తమ కుమారులకు ఆరంభంలో సరైన హిట్ ఇవ్వలేకపోయాడు. నాగచైతన్యని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో పరిచయం చేయకుండా ఆ బాధ్యతను దిల్‌రాజుకి అప్పగించాడు. అక్కినేని అఖిల్‌ని నితిన్, వినాయక్‌లకు అప్పగించాడు. ఈ విషయంలో తాను పొరపాటు చేసినట్లు ఓపెన్‌గా నాగ్ ఒప్పుకున్నాడు.
ఇక నాగచైతన్య విషయానికి వస్తే ఆయన మొదటి చిత్రం కాలేజీ స్టూడెంట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వాసువర్మ దర్శకత్వంలో దిల్‌రాజు ‘జోష్’లో నటించాడు. కానీ ఈ చిత్రం మెప్పించలేకపోయింది. దాంతో చైతుని ఫ్లాప్ ఇచ్చిన తానే మరోసారి భారీ బ్లాక్‌బస్టర్ ఇచ్చి దిల్‌రాజు లెక్కని సరిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ఐదారు ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్న దిల్‌రాజు తాజాగా నాగచైతన్యతో ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. తన బేనర్‌లో 10ఏళ్లుగా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న శశి అనే యువ దర్శకుడితో నాగచైతన్య చిత్రం ఉండనుంది.
ప్రస్తుతం నాగచైతన్య కూడా శివనిర్వాణ దర్శకత్వంలో తన శ్రీమతి సమంతతో ‘మజిలి’, ఆ తర్వాత బాబి దర్శకత్వంలో తన మేనమామ విక్టరీ వెంకటేష్‌లతో కలిసి ‘వెంకీ మామా’ చిత్రాలలో నటిస్తున్నాడు. ఇవి పూర్తి అయిన తర్వాత దిల్‌రాజు చిత్రం ఉండనుందని సమాచారం. ‘శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి’ వంటి సాధారణ చిత్రాల తర్వాత చైతుకి ‘మజిలి, వెంకీమామ’తో పాటు దిల్‌రాజు చిత్రాలు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో వేచిచూడాల్సివుంది.