`డీజే దువ్వాడ జగన్నథం` సినిమా సమయంలో బ్రాహ్మణులను కించపరిచాడంటూ హరీష్‌శంకర్‌పై బ్రహ్మణ సంఘం యుద్ధం ప్రకటించింది. సినిమాలో హీరో అల్లు అర్జున్ పెళ్లిళ్లకు, ఫంక్షన్‌లకు వంటలు చేసే బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తాడు. కొన్ని సన్నివేశాల్లో పూజాహెగ్డేతో కనిపించే అతి సీన్‌లకు ఆగ్రహించిన బ్రాహ్మణ సంఘాలు అప్పట్లో దర్శకుడు హరీష్‌శంకర్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినకుండా సినిమాలు మార్పులు చేయాలని పట్టుబట్టారు కూడా. దాంతో హరీష్ శంకర్ దిగిరావాల్సి వచ్చింది. తాజాగా తను చేస్తున్న `వాల్మీకి` చిత్రానికి అదే పరిస్థితి ఎదురవుతోంది.
వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `వాల్మీకి`. హరీష్‌శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమిళ హిట్ చిత్రం `జిగర్తాండ` చిత్రానికిది రీమేక్. సిద్దార్థ, బాబీ సింహ హీరో, విలన్‌గా నటించారు. బాబీ సింహా పోషించిన పాత్రని తెలుగులో వరుణ్‌తేజ్ పోషిస్తున్నాడు. విలన్ ఛాయలున్న పాత్రలో తొలిసారి వరుణ్‌తేజ్ నటిస్తున్న ఈ సినిమా టైటిల్ డీజైన్ ఇప్పుడు వివాదానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. సినిమా టైటిల్ అభ్యంతరకరంగా వుందంటూ జాతీయ వాల్మీకీ ఐక్యపోరాట సమితి తమ నిరసన వ్యక్తం చేసింది.
కర్నూలు జిల్లా మహానందిలో భారీ సంఖ్యలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. తమ మనోభావాలు దెబ్బతినే విధంగా `వాల్మీకి` టైటిల్‌లో గన్, మారణాయుధాలను పెట్టి మా సామాజిక వర్గాన్ని అవమానించారని జాతీయ వాల్మీకీ ఐక్యపోరాట సమితి ఉపాధ్యక్షులు హరీష్‌శంకర్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గొప్ప పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి పేరును ఓ గ్యాంగ్‌స్టర్ సినిమాకు పెట్టడం అవమానకరంగా వుందని, దీనిపై హరీష్‌శంకర్ వెంటనే స్పందించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. దీనిపై హరీష్‌శంకర్‌కానీ, చిత్ర నిర్మాణ సంస్థ గానీ ఇంత వరకు స్పందించలేదు.