రెండు మూడు చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిస్తే చాలు మన యంగ్ హీరోలు వెంటనే పరభాషలపై దృష్టి పెడుతున్నారు. ఎంతో కాలంగా తెలుగులో సీనియర్ స్టార్స్‌గా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌లు కూడా బాలీవుడ్‌కి వెళ్లి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దాంతో మరలా తెలుగులోకి వచ్చేశారు. తాజాగా నాగ్ ‘బ్రహ్మాస్త్ర’ అనే మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. ఆ తర్వాతి తరంలో కూడా రామ్‌చరణ్ ‘జంజీర్’తో బాలీవుడ్‌లోకి, మహేష్ ‘స్పైడర్’ ద్వారా తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి దెబ్బతిన్నారు. దీనికి ఎవరో ఒకరిద్దరు మినహాయింపు, రానా, అల్లుఅర్జున్‌కి మలయాళంలో, ప్రభాస్‌కి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇలా ఈ ముగ్గురు మినహా ఇతర భాషల్లో ఆకట్టుకున్న తెలుగు హీరోలు తక్కువే అని చెప్పాలి. కానీ బహుభాషల్లో గుర్తింపు తెచ్చుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. నిర్మాతలకు, హీరోలకు కూడా ఇది కలిసి వస్తుంది. ఆర్ధికపరంగా, బడ్జెట్ విషయంలో కూడా వెసులుబాటు ఉండటం ఖాయం. దీనిని దృష్టిలో పెట్టుకునే విశాల్, కార్తి నుంచి ఎందరో కోలీవుడ్ హీరోలు తెలుగులో కూడా తమ క్రేజ్‌ని పెంచుకునే పనిలో ఉన్నారు.
ఇక విషయానికి వస్తే తెలుగులో ప్రస్తుతం ఉన్న యంగ్‌స్టార్స్‌లో విజయ్‌దేవరకొండ ఒకరు. అతి తక్కువ సమయంలోనే ఈయన సెన్సేషనల్ స్టార్‌గా, రౌడీస్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ కూడా తమిళంలో కూడా గుర్తింపును ఆశిస్తున్నాడు. ఇందులో భాగంగానే తెలుగు, తమిళ భాషల్లో ‘నోటా’ చేసి దెబ్బతిన్నాడు. త్వరలో మరో ఒకటి రెండు ప్రాజెక్ట్స్‌ని ద్విభాషా చిత్రాలుగా చేయనున్నాడు. విజయ్ నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం ప్రస్తుతం తమిళంలో విక్రమ్ కుమారుడు దృవ్ హీరోగా బాల దర్శకత్వంలో ‘వర్మ’గా రీమేక్ అవుతోంది. ఇక త్వరలో విజయ్ బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి.
‘అర్జున్‌రెడ్డి’ చిత్రం బాలీవుడ్‌లో కూడా రీమేక్ అవుతోంది. సాధారణంగా ఏదైనా హీరోకి స్టార్ స్టేటస్ వస్తే పాత చిత్రాలను కూడా దుమ్ముదులిపి ఇతర భాషల్లో ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడం కోసం డబ్బింగ్‌లు చేసేస్తుంటారు. దీనివల్ల ఆ హీరోలకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. ప్రస్తుతం విజయ్ పరిస్థితి కూడా అలానే ఉంది. విజయ్ నటించిన డిజాస్టర్ మూవీ ‘ద్వారక’ చిత్రాన్ని తమిళంలోకి ‘అర్జున్‌రెడ్డి’ పేరుతో డబ్ చేస్తున్నారు. అందుకని ఈ విషయంలో విజయ్ కాస్త జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.