ప్రస్తుతం కంగనాతో పెట్టుకుంటే ఏ రేంజ్ లో ఆడుకుంటుందో అనేది మణికర్ణిక విషయంలోనే తేటతెల్లమైంది. ఏదో గౌతమిపుత్రని చేశాక బాలీవుడ్ లో కంగనాతో ఝాన్సీలక్ష్మీభాయ్ జీవిత చరిత్రని మణికర్ణిక సినిమా చేసుకున్న క్రిష్ కి ఆ సినిమా తెరకెక్కిస్తున్నప్పుడే... కంగనాతో దర్శకుడు క్రిష్ కి విభేదాలు మొదలయ్యాయి. ఇక చివరికొచ్చేసరికి కంగనా ఆగడాలు భరించలేని క్రిష్ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేశాడు. కంగనా మాత్రం కంకణం కట్టుకుని మణికర్ణికతో ఎలాగో తిప్పలు పడి... మిగిలిన డైరెక్షన్, విఎఫెక్స్ అన్ని పూర్తి చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ఆ సినిమాలో కంగనా నటనకు మంచి మార్కులు రావడం.. ఆమె డైరెక్షన్ ని కొంతమంది పొగడడంతో... అసలే పారితోషకం అందుకోని క్రిష్ మీడియా ముందు కంగనాని నానా మాటలు అన్నాడు. కంగనా ఎందుకు ఊరుకుంటుంది. అసలే తనతో పెట్టుకున్నవాళ్ళకి ఎలాంటి గతి పట్టిస్తుందో అనేది బాలీవుడ్ జనాలకు మాత్రమే తెలుసు.
తాజాగా క్రిష్ కూడా తెలుసుకున్నట్టుగా కనబడుతుంది. అందుకే కంగనాకు కౌంటర్లు ఇవ్వడం ఆపేశాడు. ఇక కంగనాతో గతంలో హృతిక్ రోషన్, కరణ్ జోహార్ ఇంకా చాలామంది ప్రముఖులు పెట్టుకుని సైలెంట్ అయినా వాళ్ళే. కంగనా చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి రచ్చ చేసే క్యారెక్టర్ ఆమెది. అందులోనూ వారసత్వ నటీనటులంటే ఒళ్ళుమంట. అందుకే కొంతమంది వారసత్వ నటులకు పడి ఏడుస్తుంటుంది. ఇక మణికర్ణికా విషయం, హృతిక్ విషయం, కరణ్ జోహార్ తో పెట్టుకున్న విషయం అలాగే క్వీన్ లాంటి గొప్ప సినిమా తీసిన దర్శకుడిని కూడా కంగనా ఆడేసుకుంది.
ఇక ఇప్పుడు కంగనా రనౌత్ తో సినిమా చెయ్యాలంటే దర్శకనిర్మాతలు ఒణకాల్సిన పరిస్థితి. ఏదో టాలెంట్ ఉంది కదా ఆమెతో సినిమా చేద్దామనుకుంటే.. సినిమా పూర్తయ్యేలోపల కంగనాతో వాళ్లకు ఎలాంటి సమస్య వస్తుందో అనే ఆలోచనతో ఆమెతో సినిమాలు చెయ్యడానికి దర్శకనిర్మాతలెవరు ధైర్యం చెయ్యడం లేదట. మరి మణికర్ణికకు నేనే డైరెక్టర్ అని చెప్పుకుంటున్న కంగనా ఫ్యూచర్ లో తాను హీరోయిన్ గా చేసే సినిమాలు తానే డైరెక్ట్ చేసుకోవాల్సి వస్తుందేమో. తన నోటికి భయపడి దూరంగా ఉంటున్న దర్శకనిర్మాతలను మాత్రం కంగనా ఎలా వదిలేస్తుంది. టైం చూసి వాళ్ళని పట్టుకుంటుంది.