ప్రస్తుతం కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్‌హాసన్, అజిత్‌లు టాప్‌స్టార్సే అయి ఉండవచ్చుగానీ మరో స్టార్ విజయ్ మాత్రం ఈమధ్యకాలంలో తన చిత్రాల కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక సామాజిక సమస్యల మీద, నీచరాజకీయాలపైనా మండిపడుతూ ఎండగడుతున్నాడు. ‘కత్తి, మెర్సల్, సర్కార్’ ఇలా వరుసగా ప్రజలను చైతన్యవంతం చేసే కథలు, వర్తమాన పరిస్థితులలోని సామాజిక లోపాలను ఎత్తిచూపుతున్నాడు.
తాజాగా ఆయన తన 63వ చిత్రాన్ని మరో సారి దర్శకుడు అట్లీతోనే చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం క్రీడా నేపధ్యం, క్రీడల్లోని అవినీతి, రాజకీయాలను కథాంశంగా ఎంచుకున్నాడు. తాజాగా ఈ మూవీకి ‘మైఖేల్’ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీ ఫుట్‌బాల్ క్రీడా నేపధ్యంలో సాగుతుందని తెలుస్తోంది. గతంలో అట్లీతో తాను చేసిన ‘మెర్సల్’ చిత్రంలో ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమైన జీఎస్టీ, వైద్యరంగంలో వేళ్లూనుకున్న అవినీతిని ఎండగట్టి వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచాడు. బిజెపితో పాటు పలు హిందు సంస్థలు ఈ చిత్రంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. కానీ ఈ ఆందోళనకు విజయ్, అట్లీలు భయపడలేదు.
‘థేరీ,మెర్సల్’ తర్వాత అట్లీతో విజయ్ చేస్తోన్న ఈ హ్యాట్రిక్ మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ‘తుపాకి, కత్తి, సర్కార్’ల ద్వారా మురుగదాస్‌తో హ్యాట్రిక్ హిట్స్ సాధించిన విజయ్.. అట్లీతో కూడా అదే ఫీటు సాధించడం ఖాయమేనని చెప్పాలి. మన దేశంలో క్రీడా వ్యవస్థలోని లోపాలు, ప్రతిభ ఉన్న క్రీడాకారులకు జరుగుతున్న అన్యాయాలు, బంధుప్రీతి, ఇలా క్రీడా వ్యవస్థలోని తప్పులను ఎత్తి చూపే ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.