నిన్నటితరం సీనియర్ స్టార్స్‌లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌లు బాలీవుడ్‌లో కూడా నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. నేడు మాత్రం ప్రభాస్, రానా, అల్లుఅర్జున్ వంటి వారు ఇతర భాషలపై కన్నేస్తున్నారు. ఇక అల్లరినరేష్, ఆర్యన్‌రాజేష్, శర్వానంద్, సందీప్‌కిషన్ వంటి వారు కూడా కోలీవుడ్‌లో గుర్తింపు పొందాలని భావించి విఫలమైన వారే. తాజాగా యంగ్‌స్టార్స్ అయిన నేచురల్‌స్టార్ నాని, రౌడీస్టార్ విజయ్‌దేవరకొండ వంటి వారు తమిళ మార్కెట్‌పై కూడా కన్నేశారు. నాని, విజయ్‌లు సైతం గతంలో ఈ విషయంలో కొన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేకపోయారు. కానీ రాబోయే సినిమాల ద్వారా వీరిద్దరు మరోసారి టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌ని కూడా మనసులో పెట్టుకుని చిత్రాలు తీస్తున్నారు. దీనిలో భాగంగా యూనివర్శల్ సబ్జెక్ట్స్‌కి ఓకే చెబుతున్నారు.
ఇక నాని విషయానికి వస్తే ఆయన నటించిన ‘భలే భలే మగాడివోయ్’ నుంచి ఆయన చేసిన కొన్ని చిత్రాలు తమిళంలో రీమేక్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన అన్ని భాషల వారిని రంజింపజేసే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉన్న యూనివర్శల్ సబ్జెక్‌తో వస్తున్నాడు. అదే ‘జెర్సీ’. సుమంత్‌తో ‘మళ్లీరావా’ చిత్రం తీసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరు డైరెక్షన్‌లో వస్తున్న ఇందులో నాని వయసు పైబడిన సమయంలో క్రికెటర్‌గా మారాలని భావించి, రంజీ ప్లేయర్ అయ్యే పాత్రలో నటిస్తున్నాడు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత తమిళ నెంబర్‌వన్ సంగీత దర్శకుడు అనిరుధ్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని తమిళంలో కూడా విడుదల చేయనుండటం వల్ల అనిరుధ్ ఇచ్చే ఆల్బమ్ కోలీవుడ్‌లో కూడా సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ‘విక్రమ్ వేద’లో నటించిన శ్రద్దాశ్రీనాథ్ ఇందులో హీరోయిన్ పాత్రను పోషించడం మరో విశేషం. ఇందులోని తమిళ వెర్షన్‌కి ‘మలక్కావిలయే’ అనే పాటను ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్‌శివన్ స్వయంగా రాశాడు. ఇక ఇది నాని నటిస్తున్న రెండో స్పోర్ట్స్ డ్రామా అనే చెప్పాలి. గతంలో తమిళ రీమేక్‌గా వచ్చిన ‘భీమిలి కబడ్డీజట్టు’లో నాని నటించిన విషయం తెలిసిందే.