నాగ చైతన్య,సమంత, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మజిలీ సినిమా టీజర్ ప్రేమికుల రోజు సందర్భంగా గురువారం విడుదలైంది. మజిలీ సినిమాలో నాగ చైతన్య క్రికెటర్‌గా కనబడుతుండగా.. సమంత డీ గ్లామర్ గా చైతు భార్యగా కనబడుతుంది. ఇక నాగ చైతన్య గర్ల్ ఫ్రెండ్‌గా చైతూని మోసం చేసే ప్రియురాలి పాత్రలో దివ్యాంశ కౌశిక్ కనబడుతుందనేది మజిలీ టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ప్రేక్షకుల హృదయాలను దోచేసేలా మజిలీ టీజర్‌ని కట్ చేశారు.
టీజర్ మొదటగా రావు రమేష్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. నీకో సంవత్సరం టైం ఇస్తున్నా... ఈ లోగా నువ్వు సచిన్‌వి అవుతావో... సోంబేరివి అవుతావో అంటూ... రావు రమేష్, నాగ చైతన్యని ఉద్దేశించి చెప్పడం.. అలాగే వాల్తేరు గ్రౌండ్ విశాఖపట్నంలో చైతూ క్రికెట్ ప్రాక్టీసు చెయ్యడం చూపిస్తూనే నాగ చైతన్య, దివ్యాంశ కౌశిక్ ప్రేమలో పడడం.. ఆమెతో లిప్ లాక్ చెయ్యడం దగ్గరనుండి.. ఆమెని డీప్‌గా లవ్ చెయ్యడం.. మధ్యలో ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందో.. కెరీర్ కోసం దివ్యాంశని వదిలేసాడో.. సమంతని పెళ్లి చేసుకోవడంతో.. చైతూ డిఫ్రెంట్ లుక్‌లోకి మారిపోతాడు. ప్రేమని దూరం చేసుకున్న ప్రేమికుడిలా చైతు గెడ్డం లుక్‌తో... ‘నువ్వు నా రూము లోపలికి రాగలవేమో గానీ, నా మనసులోకి ఎప్పటికీ రాలేవు’ అంటూ సమంత తో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
ఇక సమంత కూడా భర్త తప్పులను, ద్వేషాన్ని భరిస్తూ.. చాలా సాదాసీదా గృహిణిగా భర్తను వెనకేసుకొచ్చే అమ్మాయిలా కనబడుతుంది. మరి లవ్, ఎమోషన్స్ కలగలిసిన మజిలీ.. టీజర్ తోనే మంచి అంచనాలు పెంచేసింది. అసలే చైతూ - సమంత కాంబినేషన్, అలాగే హిట్ డైరెక్టర్ శివ నిర్వాణ, చైతు మాస్ లుక్, సమంత డీ గ్లామర్ లుక్, దివ్యాంశ చైతు ప్రియురాలిలా అందరూ ఆకట్టుకున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమాను దర్శకనిర్మాతలు ఏప్రిల్ 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.