నిజానికి హీరోలకు ధీటుగా ఉండే విలన్ పాత్రలు ఉంటేనే ఆయా హీరోల హీరోయిజం కూడా పండుతుంది. ఈ విషయంలో ఇప్పటికే రాజమౌళి, బోయపాటిశ్రీను వంటి వారు ముందున్నారు. కానీ వీరి కంటే ముందే తేజ ఈ ట్రెండ్‌కి నాడే శ్రీకారం చుట్టాడు. హీరోగా పరిచయం అయిన గోపీచంద్‌ని విలన్‌ని చేసి, మరలా ఆయన నిలబడేలా చేయగలిగాడు. నితిన్ వంటి హీరోతో గోపీచంద్‌ని ఎంతో పవర్‌ఫుల్‌గా చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఇక తాజాగా ఆయన బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్‌ల జోడీతో ‘సీత’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విలన్‌గా ఆయన సోనూసూద్‌కి అవకాశం ఇచ్చాడు. నిజానికి సోనూసూద్‌కి ‘సూపర్’ వంటి చిత్రం ఉన్నప్పటికీ ఆయన ‘వదల బొమ్మాళి’ అంటూ డైలాగ్ కింగ్ రవిశంకర్ గంభీరంగా డబ్బింగ్ చెప్పిన ‘అరుంధతి’ తర్వాత మరలా అంతటి మంచి పాత్ర ఆయనకు రాలేదు. ఇక ఓవర్ విలనిజమ్, కామెడీ ప్రయత్నంలో చేసిన ‘ఆగడు’ చిత్రం డిజాస్టర్ అయిన తర్వాత ఈయన హవా తగ్గింది.
ఇటీవల విడుదలైన కంగనారౌనత్ ‘మణికర్ణిక’లో ఆయన పాత్రను మరలా వేరే వారి చేత చేయించడం ఆయనను బాగా బాధపెట్టిందట. అంతేకాదు.. ఈమధ్య ఆయన నిర్మాణ భాగస్వామిగా కూడా మారి ఆర్ధికంగా దెబ్బతిన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనలోని సత్తాని మరోసారి చాటే చిత్రంగా ‘సీత’ ఉంటుందని తెలుస్తోంది. ఈ పాత్రను ఎంతో వైవిధ్యంగా, పవర్‌ఫుల్‌గా, హీరోకి సరిసమానంగా తేజ తీర్చిదిద్దాడట. ఇదే జరిగితే సోనూసూద్ ముందు తనదైన నటనతో పోటీ పడటం బెల్లకొండ సాయిశ్రీనివాస్‌కి అగ్నిపరీక్షేనని చెప్పాలి. ఏమాత్రం తేడా వచ్చినా సోనూసూద్ ముందు బెల్లంకొండ తేలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇక ఈ చిత్రం తర్వాత బెల్లంకొండ హీరో ‘ఆర్‌ఎక్స్ 100’ దర్శకుడు అజయ్‌భూపతి దర్శకత్వంలో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ‘మహాసముద్రం’లో నటించనున్నాడు. ఇది మల్టీస్టారర్ చిత్రం అని తెలుస్తోంది. మరి ఇందులో రెండో హీరోగా ఎవరు నటిస్తారో వేచిచూడాలి..! ఇలా చూసుకుంటే బెల్లంకొండ హీరోకి ‘సీత’తో పాటు ‘మహాసముద్రం’ కూడా అగ్నిపరీక్షగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.