తాత్కాలికంగా సోషల్‌మీడియాను ఉపయోగించుకుని రాత్రికి రాత్రే సెలబ్రిటీ కావడం అనేది గొప్పే గానీ, అది శాశ్వతం కాదనే సత్యం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అలా కొన్ని సెకండ్ల వీడియోతో కళ్లు గీటే సీన్‌తో దేశవ్యాప్తంగా మలయాళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్ సంచలనం సృష్టించింది. కానీ నాడే హీరో సిద్దార్ధ్‌తో పాటు పలువురు ఆమె ఒక రోజు రాణిగా మిగలకుండా ఉండాలని, కేవలం కొన్ని రోజులు సెన్సేషన్ కోసం కాకుండా స్థిరమైన స్థానం కోసం కృషి చేయాలని సలహా ఇచ్చారు.
ఇక మన పెద్దలు నిదానమే ప్రధానం అని చెబుతూనే, ఆలస్యం అమృతం విషం.. రెంటికి చెడ్డ రేవడి అనే సామెతలను కూడా వాడారు. అవి ఇప్పుడు ఈ వింక్ గర్ల్ విషయంలో నిజమని నిరూపితం అయ్యాయి. మలయాళంలో ఓ చిన్న చిత్రంగా, కంటెంట్‌లేని మూవీగా రూపొందిన ‘ఒరు ఆధార్ లవ్’ షూటింగ్ పూర్తి చేసుకునే సరికి ఈ మూవీకి తెలుగు, తమిళంలో కూడా క్రేజ్ ఏర్పడింది. దాంతో దర్శకుడు ఒమర్‌లల్లూ, నిర్మాతలు కలిసి ఈ చిత్రాన్ని చాలా భాషల్లో డబ్బింగ్ చేసి క్యాష్ చేసుకున్నారు. తెలుగులో ‘లవర్స్‌డే’గా విడుదలైన ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ కంటే మరో హీరోయినే ఎక్కువగా మెప్పించింది. వింక్ గర్ల్ ఏమాత్రం ఆకట్టుకోలేదు.
ఇక ఈమె కన్ను గీటే వీడియో విడుదలైన వెంటనే ఈమెకి తెలుగులో అల్లుఅర్జున్ తో పాటు బాలీవుడ్ మూవీ మేకర్స్ కూడా కోట్లలో పారితోషికం ఇస్తామని ముందుకు వచ్చారు. కానీ తాను వాటిని వదులుకున్నానని, బన్నీ చిత్రం కూడా అందులో ఉందని స్వయంగా ఆమే చెప్పింది. ఈ చిత్రం విడుదలైతే మరింతగా అవకాశాలు వస్తాయనే దర్శకుడి మాట నమ్మిన ఈమెని ప్రస్తుతం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ చిత్రానికి ముందే వచ్చిన ఆఫర్లను ఒప్పుకుని ఉంటే కాస్తైనా వర్కౌట్ అయి ఉండేది. ఇప్పుడు అల్లుఅర్జున్ కాదు కదా.. చివరకు సప్తగిరి కూడా ఆమెకి అవకాశం ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. మొత్తానికి ఈమె పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయిందని మాత్రం చెప్పవచ్చు.