సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు అనేది అందరికీ తెలిసిందే. ఇక స్నేహితం వేరు.. రాజకీయాలు కూడా వేరని చెప్పవచ్చు. దీనికి మంచి ఉదాహరణ పవన్‌కళ్యాణ్‌కి వీరాభిమాని అయిన బండ్ల గణేష్ జనసేనలో చేరకుండా కాంగ్రెస్‌లో చేరడమే. ఇక తాజాగా పవన్‌కి మరో భక్తుడైన కమెడియన్ అలీ కూడా టిడిపి వైపు అడుగులు వేస్తోన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల అలీ వరుసగా చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్ ఇద్దరితో భేటీ అయ్యాడు. కానీ అది మర్యాద పూర్వక కలయిక మాత్రమే అని చెప్పాడు. మరోవైపు అలీకి ఎప్పటి నుంచో రాజమండ్రి లేదా ఆ చుట్టుపక్కల ఉన్న ఉభయగోదావరి జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంది. సినిమా వారంటే వారు ఎంత తక్కువ స్థాయి వారైనా నారా చంద్రబాబునాయుడు నెత్తిన పెట్టుకుంటారు.
మురళీమోహన్, బాబూమోహన్ నుంచి దివ్యవాణి, వాణి విశ్వనాథ్ వంటి ఎందరినో దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. గతంలో అలీని రాజకీయాలలోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయమని చంద్రబాబు దూతగా మురళీమోహన్ కోరాడు. ఇక ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యేలుగా టిడిపిలో ముస్లిం మైనార్టీలు పెద్దగా లేరు. దాంతో వైసీపీ నుంచి జంప్ చేసిన ముస్లిం ఎమ్మెల్యేలను, ఇతర ముస్లింలను ఎమ్మెల్సీలను చేసి చంద్రబాబు ఆ లోటు తీరుస్తున్నాడు. ఈ విధంగా చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో అలీ ఎమ్మెల్యేగా నిలబడి గెలిస్తే మొదటి దఫాలోనే మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో బాబూమోహన్‌ని కూడా చంద్రబాబు అలాగే మంత్రిని చేశాడు.
ఇక తాజాగా విజయవాడలో అలీ దంపతులకు ఘనసన్మానం కోసం ఏర్పాటు చేసిన వేడుకకు చంద్రబాబు హాజరయ్యాడు. అలీ రాజకీయాలలోకి వచ్చి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలని చంద్రబాబు కోరాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ, మంచి ఉద్యోగంలో ఉండి మరీ ఎన్టీఆర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాలలోకి వచ్చాడు. తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తూ రాజకీయాలలో సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చిన తర్వాతే తెలుగు వారికి మంచి గుర్తింపు లభించింది. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలిపిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది.
అలాగే తన 40ఏళ్ల కెరీర్‌లో కూడా అలీ ఎంతో కష్టపడ్డాడు. ఓ మంచి వ్యక్తిని అభిమానించాలనే ఉద్దేశ్యంతోనే నేను ఈ వేడుకకు వచ్చాను. జీవితంలో రిలాక్సేషన్ కావాలంటే అలీ వంటి వ్యక్తులు ఉండాలి. అలీ రాజకీయాలలోకి రావాలంటూనే ఆయన కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపాడు. ఇలా అలీ-బాబులు ఒకటి కావడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన-టిడిపి మధ్య రహస్య అవగాహన ఉండే అవకాశం ఉందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి.