‘అజ్ఞాతవాసి’ చిత్రంతో త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి కనీవినీ ఎరుగని డిజాస్టర్ వచ్చింది. ఎన్నడు లేని విధంగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ తర్వాత ఆయన ఎన్టీఆర్‌తో చేసిన ‘అరవింద సమేత వీరరాఘవ’తో గాడిలోకి వచ్చాడు. మరోవైపు అల్లుఅర్జున్ విషయానికి వస్తే ఆయన మునుపటి చిత్రం ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. స్టార్‌రైటర్ అయిన వక్కంతం వంశీని నమ్మి చేసిన ఈ చిత్రం ఆయనకు సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో బన్నీ మేకప్ వేసుకుని దాదాపు 10నెలలు అయింది. ఎట్టకేలకు ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత హ్యాట్రిక్ మూవీగా త్రివిక్రమ్‌కి ఓకే చెప్పాడు. ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌తో పాటు గీతాఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఇందులో అల్లుఅర్జున్ హీరోగా, హీరోయిన్‌గా కైరా అద్వానీని గానీ, లేదా గీతాఆర్ట్స్‌కి డేట్స్ ఇచ్చి ఉన్న రష్మికా మందన్నాని గానీ పెట్టుకోవాలని భావించాడు. సాధారణంగా మెగా కాంపౌండ్ హీరోలతో ఓ చిత్రం చేస్తే వెంటనే ఇతర మెగా ఫ్యామిలీ హీరోలు అదే హీరోయిన్‌ని ఎంచుకోవడం సెంటిమెంట్‌గా వస్తోంది. సో... ‘వినయ విధేయ రామ’లో రామ్‌చరణ్ సరసన నటించిన కైరా అద్వానీకి బన్నీ ఓటు వేశాడు. కానీ తన హిట్ చిత్రాలలో నటించిన హీరోయిన్లకు వెంటనే చాన్స్ ఇవ్వడం అనేది త్రివిక్రమ్ సెంటిమెంట్. సమంత, ఇలియానా.. ఇలా ఎందరినో దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
దాంతో త్రివిక్రమ్ పట్టుబట్టి మరీ ఈ చిత్రానికి పూజాహెగ్డేని తీసుకున్నాడని సమాచారం. సాధారణంగా మన స్టార్స్ ఒకసారి చేసిన హీరోయిన్లతో రెండో సారి చేసేందుకు ఇంట్రెస్ట్ చూపరు. దాంతో డిజెలో తనతో నటించిన పూజాహెగ్డేని తప్పనిసరి పరిస్థితుల్లో బన్నీ ఓకే చేయాల్సివచ్చింది. ఇక సంగీత దర్శకునిగా అరవింద సమేత వీరరాఘవకి పనిచేసిన తమన్‌ని మరోసారి త్రివిక్రమ్ ఎంచుకున్నాడు. కానీ బన్నీకి మాత్రం దేవిశ్రీతో పనిచేయాలని ఉంది. అయినా ఈ విషయంలో కూడా అల్లుఅర్జున్ రాజీ పడ్డాడని సమాచారం.
అరవింద సమేత వీరరాఘవ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించిన తమన్ ప్రస్తుతం ఈ చిత్రానికి ట్యూన్స్ అందించడంలో బిజీగా ఉన్నాడు. గతంలో బన్నీ-తమన్‌ల కాంబినేషన్‌లో ‘రేసుగుర్రం, సరైనోడు’ చిత్రాలు వచ్చాయి. ఆ రకంగా చూసుకుంటే ఈ తాజా చిత్రం త్రివిక్రమ్‌తోనే కాదు.. తమన్‌తో కూడా బన్నీకి హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. వేసవిలో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్ర విశేషాలు త్వరలో అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.