నేటిరోజుల్లో శతదినోత్సవాలే కాదు అర్ధశతదినోత్సవాలు కూడా ఉండటం లేదు. సినిమా లాంగ్ రన్ మూడు నాలుగు వారాలకే పూర్తవుతోంది. ప్రత్యేకంగా 25 రోజుల వేడుకలు, మొదటి వారం విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. కానీ నాడు సినిమా వారికి శత, అర్ధశతదినోత్సవాలే అతి ముఖ్యమైన వేడుకలు. ఈ వేడుకలలో పంపిణీదారులకు, ఎగ్జిబ్యూటర్లకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు షీల్డ్‌లు, మొమెంటోలు ఇవ్వడం ఎంతో ఘనంగా, ప్రతిష్టాత్మకంగా ఉండేది.
ఇక విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించి, ఏకంగా 130కోట్లు వసూలు చేసి, దిల్‌రాజు, అనిల్‌రావిపూడి, విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్‌లకు బ్లాక్‌బస్టర్‌ని అందించిన చిత్రం ‘ఎఫ్ 2’ ఏకంగా 130 కేంద్రాలలో నిజమైన అర్ధశతదిన్సోవం జరుపుకోవడం అంటే అది మామూలూ విషయం కాదు. ఎప్పుడో పుష్కరానికి ఓసారి ‘బాహుబలి, రంగస్థలం, ఎఫ్2’ల తరహాలో ఇవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వేడుకలకు ఏవో కారణాల చేత డుమ్మా కొట్టడం సరికాదు. ఇలాంటి వేడుకలు మరిన్ని జరగాలని కోరుకునే వారు ఖచ్చితంగా వీలు చూసుకుని అయినా ఇలాంటి ఫంక్షన్లకు హాజరైతే బాగుంటుంది. హీరోయిన్లు రాకపోతే అది వారి ఖర్మ. కానీ మన హీరోలే వాటికి డుమ్మా కొడితే ఆ వేడుకలలో కళ పోతుంది. ప్రేక్షకుల ఆసక్తి తగ్గుతుంది.
ఇదే ‘ఎఫ్ 2’ అర్ధశతదినోత్సవ వేడుకల్లో జరిగింది. ఈ చిత్రం తర్వాత విక్టరీ వెంకటేష్ ‘వెంకీ మామ’ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. వరుణ్‌తేజ్ తన తదుపరి చిత్రం కోసం విదేశాలలో బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా దిల్‌రాజే చెప్పి అందువల్లనే వారు రాలేకపోయారని తెలిపాడు. కానీ ఎంత బిజీ ఉన్నా ఇలాంటి అరుదైన వేడుకలకు రెండు మూడు రోజుల సమయం కేటాయిస్తే అది అందరికీ ఆనందం కలుగజేస్తుందని వేరే చెప్పాల్సిన పని లేదు.