భారతదేశం ప్రజాస్వామిక దేశం. ఇక్కడ ఎవరు ఏ పార్టీనైనా అభిమానించి ఓటు వేయవచ్చు. ఏ కులం, మతం, వర్గం, ప్రాంతీయాభిమానాలను రెచ్చగొట్టి మరీ ఓటు బ్యాంక్‌ని పెంచుకోవచ్చు. కానీ ఇదే సమయంలో మన ఓటర్లు ఎవరికి మద్దతు ఇచ్చినా కూడా రెండు విషయాలలో మాత్రం ప్రతి పార్టీని, నాయకుడిని నిలదీయాల్సివుంది. అవే విద్య, వైద్య రంగాలు. భారతదేశాన్ని పట్టిపీడుస్తున్న విషయాలలో అవినీతి, జవాబుదారీతనం లేకపోవడం అత్యంత ప్రమాదంగా కనిపిస్తున్నాయి.
సరే.. ప్రాజెక్ట్‌లు, రోడ్లు వంటి కాంట్రాక్ట్ విషయాలలో అవినీతి జరిగినా ఫర్వాలేదుగానీ విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేసి, వాటిని ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే పద్దతి మాత్రం పోవాలి. విద్య, వైద్య రంగాలు రెండు ఎప్పుడూ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ బాగానే పేరు తెచ్చింది గానీ సుదీర్ఘకాలంలో అది పెద్ద అవినీతికి పురుడు పోసింది. కార్పొరేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ ద్వారా వేల, లక్షల కోట్లు దోచి పెట్టే బదులు, ఒక్కో జిల్లా కేంద్రంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని సౌకర్యాలు, పరికరాలు, ఉద్యోగులు, డాక్టర్లను ఏర్పాటు చేసి మౌళిక సదుపాయాలు కల్పించి ఉంటే ప్రజలకు ప్రభుత్వాసుపత్రులలోనే మెరుగైన వైద్యం జీవితాంతం లభించి ఉండేది.
అలా కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ దోపిడీకి నాయకులు తెర తీస్తున్నారు. ఆరోగ్యశ్రీ విషయంలో స్టార్ హెల్త్, నేడు చంద్రబాబు హయాంలో మంత్రి నారాయణల విద్య, వైద్య సంస్థలు ఎలా వేళ్లూనుకుని పోయాయో ఎవరికైనా సులభంగానే అర్ధమవుతుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో విద్య, వైద్యం వంటివాటిని ప్రభుత్వాధీనంలో ఉంచే పార్టీలకు, నాయకులకు మాత్రమే ఓట్లు వేయాలి. ఈ విషయంలో ప్రతి పార్టీని, నాయకుడిని నిలదీయాల్సిన అవసరం ఉంది.