కోతికి అరటిపండు దొరికితే ఊరుకుంటుందా? దాంతో ఎలాంటి ఫీట్‌లు చేయాలో..ఎంత హంగామా సృష్టించాలో అంతా చేస్తుంది. మరి వర్మకు వివాదం దొరికితే ఊరుకుంటాడా పది తలల రావణ బ్రహ్మగా మారి వికటాట్టహాసం చేసేయడూ ..ప్రస్తుతం `లక్ష్మీస్ ఎన్టీఆర్`తో అదే పనిలో వున్నాడు రామ్‌గోపాల్‌వర్మ. దర్శకుడిగా చనిపోయాడనుకున్న ప్రతీసారి ఏదో ఒక వివాదాస్నద అంశాన్ని తీసుకుని దర్శకుడిగా తన ఆయుష్షును పెంచుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న రామ్‌గోపాల్‌వర్మకు ఓతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా `లక్ష్మీస్ ఎన్టీఆర్` దొరికింది. ఇక ఊరుకుంటాడా రెచ్చిపోడూ.
కుట్ర కుట్ర అంటూ ఆడియో సాంగ్‌ని విడుదల చేసి రచ్చకు శ్రీకారం చుట్టిన రామ్‌గోపాల్‌వర్మ తాజాగా ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తన స్వరన్ని మరింతగా పెంచి కావాల్సిన వినోదం కోసం రెడీ అయిపోతున్నాడు. తాజాగా `లక్ష్మీస్ ఎన్టీఆర్` రెండవ ట్రైలర్‌ని శుక్రవారం వదిలిన వర్మ ఈ సినిమాతో తను ఏం చేయబోతున్నది.. జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నది కుండబద్దలు కొట్టేశాడు. బాబుని టార్గెట్ చేస్తూ.. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకు ముచ్చమటలు పట్టించడం కోసం వర్మ చేస్తున్న ప్రయత్నం ట్రైలర్ చూస్తుంటే సఫలం అయ్యేలా కనిపిస్తోంది.
`వాడూ, నా పిల్లు కలిసి నన్ను చంపేశారు` అంటూ ఎన్టీఆర్ వాయిస్‌లో మొదలైన `లక్ష్మీస్ ఎన్టీఆర్` ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. ఎన్టీఆర్‌ను గద్దెదించడం కోసం చంద్రబాబు ఎలా కుట్ర చేశాడు. దానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎలా సహకరించారు. అసలు వైస్రాయ్ ఎపిసోడ్‌కు ముందు తెరవెనుక ఏం జరిగింది? . ఎన్టీఆర్‌ని ఏ విధంగా అంతా కలిసి మానసిక క్షోభకు గురిచేశారు? ఆయన మరణానికి ఎలా కారణమయ్యారు?ఇందులో మోహన్‌బాబు పాత్ర ఎంత?. టోటల్ ఎపిసోడ్‌లో హరికృష్ణ ఎలాంటి పాత్ర పోషించాడు? దీనంతటికి కీలక సూత్రధారిగా చంద్రబాబు నాయుడు ఎలా వ్యవహరించాడన్న విషయాల్ని వర్మ ఈ సినిమాలో చాలా లోతుగా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఈ సినిమా ఏపీ రాజకీయాల్లో సమరశంఖం పూరించడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.