మోసపోయే వాడుంటే మోసం చేసే వాడు ఉంటాడు. అయినా మోసపోయిన వారు తమలోని మైనస్ పాయింట్స్‌ని విశ్లేషణ చేసుకోవాలే గానీ ఎంతో కాలం జరిగిన తర్వాత ఫలానా వ్యక్తి మిస్‌గైడ్ చేశాడని ఆరోపించడం సమంజసం కాదు. ఎన్టీఆర్‌ని నాదెండ్ల భాస్కరరావు, చంద్రబాబులు మోసం చేశారని, వెన్నుపోటు పొడిచారని అంటారు. అయితే ఇందులో ఎన్టీఆర్ చేతకానితనం, తప్పుడు నిర్ణయాలు, లక్ష్మీపార్వతి పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం వంటివి ఎన్నో మిళితమై ఉన్నాయి.
ఇక చిరంజీవి ప్రజారాజ్యం విషయానికి వస్తే అతి తక్కువ సమయంలో పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా అధికారాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ రికార్డులను బద్దలుకొట్టాలనే ఉద్దేశ్యంతోనే సినిమాలలో సస్పెన్స్ మెయిన్‌టైయిన్ చేసినట్లు చిరంజీవి మీన మేషాలు లెక్కించాడు. దాంతో ప్రజల్లోకి దూసుకెళ్లడానికి, పార్టీని సంస్థాగతంగా, గ్రామ స్థాయిలో బలోపేతం చేయడం వీలు కాలేదు. ఇక చిరంజీవిని తప్పు దారి పట్టించిన వారిలో గంటా శ్రీనివాసరావు, మరీ ముఖ్యంగా అల్లుఅరవింద్‌ల పాత్ర కీలకమైనదని ఇప్పటికీ ప్రజలు అనుకుంటూ ఉంటారు. కానీ మెగాబ్రదర్ నాగబాబు మాత్రం తప్పంతా పరకాల ప్రభాకర్‌దేనని చెప్పడం హాస్యాస్పదం అనే చెప్పాలి. తమ చేతకానితనాన్ని ఇతరుల మీద నెట్టివేయడం సరికాదనేది నాగబాబు గుర్తుంచుకోవాలి. సరే పరకాల ప్రభాకర్ చిరంజీవిని పక్కదారి పట్టించాడు అనుకుందాం...! మరి నాటి పార్టీలో కీలకంగా ఉన్న డాక్టర్‌మిత్ర వంటి వారు పార్టీకి ఎందుకు దూరం అయ్యారో నాగబాబు చెప్పగలగాలి.
ఇక విషయానికి వస్తే తాజాగా మెగాబ్రదర్ నాగబాబు పరకాల ప్రభాకర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, పరకాల ప్రభాకర్ ఒక పాము. పరకాల చాలా ద్రోహం చేశారు. చిరంజీవిని మిస్ లీడ్ చేశాడు. పరకాల వంటి వారు చేసిన ద్రోహం వల్లనే చిరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. మేము గొప్ప ఆశయంతో ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించాం. తనకున్న ఇమేజ్‌తో ప్రజాసేవ చేయాలని చిరు భావించారు. అయితే ఎన్నికలకు సరిపడా సమయం లేకపోవడంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాం. తక్కువ సమయం ఉండటం వల్ల పార్టీ కేడర్‌ని నిర్మించలేకపోయాం. ఇక్కడ పరకాల కూడా మోసం చేశారు. అమ్మలాంటి పార్టీకి ద్రోహం చేశాడు. అలాంటి చర్యలతో పార్టీ బాగా దెబ్బతింది. ప్రభాకర్‌ని చిరు ఎంతగానో నమ్మాడు. అయితే ఆయన మాత్రం ద్రోహం చేశాడు. అందుకే పరకాలను పవన్ కూడా విమర్శించాడు. కోవర్ట్ అని అన్నాడు. పవన్ నైస్ పర్సన్. ప్రజారాజ్యం అనుభవాలతో ఆయన ఎంతో ముందుచూపుతో వెళ్తున్నాడు అని వ్యాఖ్యానించాడు. అయినా ఒక్క పరకాల ప్రభాకర్ వల్లనే చిరు ఫెయిల్ అయ్యాడని, కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేశాడని నాగబాబు చెప్పడం సరికాదు. ఇన్నేళ్ల తర్వాత ఇలా పరకాలను మాత్రమే దానికి బాధ్యుడిని చేయడం సరికాదనే చెప్పాలి.