లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో డా.రాజశేఖర్ ‘అర్జున’ చిత్రం విడుదల వాయిదా..!!
యాంగ్రీ హీరో డా.రాజశేఖర్ కథానాయకుడిగా సి.కల్యాణ్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్, హ్యపీ మూవీస్ పతాకాలపై కాంత కావూరి నిర్మిస్తున్న చిత్రం ‘అర్జున’. పొలిటికల్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాకి కన్మణి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేయగా మరియం జకారియా, సాక్షి గులాటీలు హీరోయిన్లుగా నటించారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల తేదీ ప్రకటించిన నేపథ్యంలో సినిమా రిలీజ్‌కు ఇబ్బందులు ఉండడంతో విడుదలను వాయిదా వేశామని నిర్మాతలు తెలిపారు. ఎన్నికల తర్వాత సినిమాను విడుదల చేస్తాం అని వెల్లడించారు. కోట శ్రీనివాసరావు, రేఖ, సనా, మురళీ శర్మ, ఆనంద్, ప్రభాకర్, బెనర్జీ, చలపతి రావు, వేణుమాధవ్, బాబు మోహన్ తదితరులు నటించిన ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చగా మధు నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.