ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి గానీ వచ్చే ఎన్నికల్లో అందరి కంటే పవన్ ముందు చూపుతో ఉన్నాడు. ఎన్నికల్లో వామపక్షాలతో తప్ప మరెవ్వరితో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశాడు. ఎన్నికల తర్వాత పొత్తుల గురించి మాట్లాడుకోవచ్చని కుండ బద్దలు కొట్టాడు. ఇక తాజాగా జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గాజు గ్లాస్‌ని కేటాయించింది.
ఇక విషయానికి వస్తే తెలుగులో పవన్‌కళ్యాణ్‌లాగానే తమిళ నాట లోకనాయకుడు కమల్‌హసన్ సొంతగా పార్టీపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన కూడా సొంతగా ‘మక్కల్ నీది మయం’ పేరుతో పార్టీని స్థాపించాడు. రాజకీయాలలో పెనుమార్పులను ఆయన ఆశిస్తున్నాడు. అందుకే తమిళ ప్రజలు తనకి పట్టం కడుతారని ఆయన ఆశపడుతున్నాడు. ఇప్పుడున్న రాజకీయాలకు భిన్నమైన రాజకీయాలను పరిచయం చేయాలనేది తన ఆశయంగా ఆయన చెబుతున్నాడు.
తాజాగా కమల్‌కి కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ గుర్తుగా టార్చ్‌లైట్‌ని ఇచ్చింది. తమకు టార్చిలైట్‌ని గుర్తుగా ఇచ్చిన ఈసీకి కమల్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. మా పార్టీకి సరైన గుర్తే లభించింది. తమిళ రాజకీయాలలోనే కాదు.. దేశరాజకీయాలలో కూడా మా పార్టీ టార్చ్‌బేరర్‌గా మారనుంది. స్వచ్చమైన చేతులతో ప్రజలకోసం పాటుపడుతాను. అవినీతి పార్టీలతో ఎప్పుడు చేతులు కలపను. డీఎంకేతో పొత్తు వద్దని భావిస్తేనే కాంగ్రెస్‌తో జతకడతానని స్పష్టం చేశాడు.
ఆయన చెప్పింది నిజమే గానీ ఆయన దృష్టిలో కాంగ్రెస్‌పార్టీ స్వచ్చమైన, అవినీతి లేని పార్టీనా? అనే విషయంలో చర్చ బాగా సాగుతోంది. రాజకీయాలలో పెనుమార్పులను ఆశిస్తూ, సరికొత్త రాజకీయాలు, పాలన అందిస్తానని చెబుతోన్న కమల్ కాంగ్రెస్‌తో పొత్తు అనేది సమంజసం కాదు. ఈ విషయంలో కమల్ కంటే పవనే కాస్త బెటర్ అని చెప్పాలి.