మన దర్శకనిర్మాతలు, హీరోలు కష్టపడి సినిమాలు తీయడమే కాదు.. వాటిని సరైన ప్రమోషన్‌తో, అచ్చి వచ్చే రిలీజ్‌డేట్‌కి విడుదల చేయడం కూడా అంతే ముఖ్యం. అయితే కొన్నిసార్లు అనుకోని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక నాగచైతన్య విషయానికి వస్తే ఆయన మొదటి చిత్రం జోష్ రిలీజ్‌డేట్‌కి వచ్చిన సమస్య అందరికీ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం రిలీజ్‌డేట్ నాడే నాటి సమైకాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి మరణం విషయం బయటకి వచ్చింది. దాంతో ఈ చిత్రాన్ని ఓరోజు వాయిదా వేశారు. ఇక గత రెండేళ్లుగా నాగచైతన్య సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. మాస్ ఇమేజ్ కోసం ఆయన చేసిన దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, సవ్యసాచి వంటి చిత్రాలన్నీ దెబ్బ తీశాయి. అదే సమయంలో సునీల్‌తో కలిసి ఆయన నటించిన తడాఖా మాత్రమే ఫర్వాలేదనిపించింది.
అదే క్లాస్ చిత్రాల విషయానికి వస్తే ఈయనకు ఏమాయ చేశావే, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం వంటి హిట్స్ వచ్చాయి. ఇక శైలజరెడ్డి అల్లుడు, సవ్యసాచి వంటి డిజాస్టర్స్ తర్వాత నాగచైతన్య నిన్నుకోరి ఫేమ్ శివానిర్వాణ దర్శకత్వంలో ‘మజిలీ’ చిత్రం చేస్తున్నాడు. ఇందులో వివాహం జరిగిన తర్వాత చైతుతో, సమంత కలిసి నటిస్తోంది. ఈ చిత్రం అలనాటి అనువాద చిత్రం, మణిరత్నం దర్శకత్వంలో మోహన్, కార్తీక్, రేవతి నటించిన ‘మౌనరాగం’ తరహాలో ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఈ మూవీని ముందుగానే ఏప్రిల్5న విడుదలకు ఫిక్స్ చేశారు. ‘మహర్షి’ వాయిదా పడటం దీనికి కలిసి వచ్చింది. అయితే ఇదే సందర్భంలో ఈ చిత్రానికి అనుకోని చిక్కులు వచ్చిపడ్డాయి.
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు మొదటి విడతలోనే జరగనున్నాయి. అంటే ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనుండగా, కేవలం ఆరు రోజుల ముందు ‘మజిలీ’ రానుంది. అంటే ఈ చిత్రం విడుదల నాటికి రాజకీయ వేడి బాగా రాజుకుని ఉంటుంది. నాయకులు, ఉద్యోగులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల మూడ్‌లో ఉంటారు. మరి అది ఏమైనా ‘మజిలీ’ ఓపెనింగ్స్‌కి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందా? అంటే ఉందనే అంటున్నారు విశ్లేషకులు. పోనీ కాస్త వారం తర్వాత రిలీజ్ చేద్దామంటే ‘చిత్రలహరి, జెర్సీ, సీత’ ఇలా యువ హీరోలంతా ఓ అండర్‌స్టాండింగ్‌తో వరుసగా వారానికో చిత్రాన్ని ఫిక్స్ చేసి ఉన్నారు. మరి ఎన్నికలు ‘మజిలీ’ ఓపెనింగ్స్‌లో ప్రభావం చూపితే పరిస్థితి ఏమిటి? అనేది వేచి చూడాలి...!