ఆడు మగాడ్రా బుజ్జీ అనే డైలాగ్ త్రివిక్రమ్ ఎందుకు రాశాడో తెలియదు కానీ రాజమౌళి కోసమే రాసుంటాడనిపిస్తోంది. కథ చెప్పకుండా సొళ్లు వాగుడు వాగుతూ మెలికలు తిరిగే దర్శకుల మందలో రాజమౌళి అనుసరించే పంథా ప్రత్యేకం. అందుకే `బాహుబలి`తో ప్యాన్ ఇండియా దర్శకుడిగా జేజేలందుకుంటున్నాడు. కథ చెప్పకుండా సినిమాలు తీసే స్టార్ దర్శకులున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీయబోయే సినిమా కథని ముందే చెప్పేసి దానికి మించి తెరపై చూపించే దర్శకుడు రాజమౌళి. ఈ విషయంలో హాలీవుడ్ దర్శకులను ఫాలో అవుతున్న రాజమౌళి తాజాగా తను రూపొందిస్తున్న అసలు సిసలైన మల్టీస్టారర్‌కు నిర్వచనంగా రూపొందుతున్న సినిమా `ఆర్ ఆర్ ఆర్`.
ఈ సినిమా కథని ఎప్పటిలాగే బయటపెట్టేశాడు రాజమౌళి. చరిత్ర గర్భంలో కలిసిపోయిన ఇద్దరు పోరాట యోధుల కథలోని ఎవరికీ తెలియని ఓ అంకాన్ని తీసుకుని దానికి సినిమా టిక్ లిబర్టీస్‌ని జోడించి కొత్తగా చరిత్రని చెప్పబోతున్నానని ఇంట్ ఇచ్చాడు. ఇద్దరు టాప్ స్టార్స్‌ని పెట్టుకుని ఎవరిపై సినిమా తీయబోతున్నాం?. అది ఏ కాలంలో నడుస్తుంది?. ఎలా వుంటుంది? అనే విషయాల్ని బయటపెట్టేశాక చెప్పడానికి ఏముంటుంది? అనుకుంటారంతా అక్కడే రాజమౌళికి కావాల్సినంత సరుకు దొరుకుతుంది. మాస్ పల్స్‌ని అనడం కంటే సగటు మనిషిలోరి భావోద్వేగాల్ని పట్టేసిన రాజమౌళి ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టేస్తుంటాడు...ఎక్కడ తగ్గాలో అక్కడే తగ్గిస్తుంటాడు. అందుకే ఇప్పటికి ఫ్లాప్‌ని చూడకుండా తన జైత్రయాత్రను అప్రతిహతంగా కొనసాగిస్తున్నాడు.
`ఆర్ ఆర్ ఆర్`తో తెలిసిన పోరాట యోధుల తెలియని కథ పేరుతో మరో సాహసానికి తెరలేపిన రాజమౌళికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కత్తిమీద సాములాంటి కథని జనరంజకంగా మలచడం అనేది మామూలు విషయం కాదు. అలాంటిది ఛాలెంజింగ్‌గా వుండే కథని తీసుకుని దానికి ఇద్దరు స్టార్ హీరోలని జతచేసి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్డం అభినందనీయం. `బాహుబలి` సినిమాతో యావత్ భారతాన్ని తెలుగు సినిమా వంక ఆశ్చర్యంతో చూసేలా చేసిన రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్`తో ఇండియన్ సినిమాల్లో తెలుగు సినిమాకు మరో కొత్త చరిత్రను లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది.