ఏ ఎన్నికలని తీసుకున్నా సినిమా వాళ్లని ప్రచారానికి వాడుకోవడమే కానీ అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కించిన పార్టీలు చాలా తక్కువే అని చెప్పాలి. స్టార్స్ చరిష్మాని వాడుకుంటూ ఓట్లు దండుకునే రాజకీయ పార్టీలు గత కొంత కాలంగా స్టార్స్‌కి ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్లకి పార్టీ టికెట్‌లు ఇచ్చిన ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా గౌరవించడం ఈ మధ్యనే మొదలైంది. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా ఎన్నికల్లో స్టార్స్ హంగామా దేశ వ్యాప్తంగా మామూలుగా లేదు. దక్షిణాదిలో ఇది మరీ ఎక్కువైపోయింది. వెండితెరపై అనర్గలంగా పంచ్ డైలాగులు దంచిన తారలు ఇప్పుడు ఎన్నికల కదనరంగంలో ప్రసంగాలు దంచేస్తున్నారు.
కొంత మంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి పోటీ చేస్తుంటే కొంత మంది వారికి సపోర్ట్‌గా నిలిచి ప్రచారం చేస్తున్నారు. ఈ దఫా చాలా మంది ప్రముఖ నటీనలు లోక్‌సభ, శాసనసభ బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2014 ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీరోల్ పోషించిన పవన్‌కల్యాణ్ ఈ దఫా జపసేన పార్టీని స్థాపించి తొలిసారి ఎన్నికల శంఖారావం పూరించారు. తమిళ సినిమారంగంలో యూనివర్సల్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న కమల్‌హాసన్ ఐదు పదుల వయసులో ఎన్నికల సమరంలోకి దిగారు. మక్కల్ నీది మయ్యిమ్ పార్టీ తరుపున ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు తమ పార్టీ అభ్యర్థుల్ని రంగంలోకి దింపబోతున్నారు.
కన్నడ రాజకీయాల్లో అంబరీష్ మరణానంతరం మాండ్యా నుంచి సుమలత బరిలోకి దిగుతోంది. ఆమెతో కన్నడ నటుడు నిఖల్ గౌడ పోటీపడుతున్నాడు. జస్ట్ ఆస్కింగ్ అంటూ బీజేపీ వర్గాలపై సమరం సాగిస్తున్న విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ ఇండిపెండెంట్‌గా బెంళూరు సెంట్రల్ నుంచి ఎంపీగా పోటీపడుతున్నారు. తన విభిన్నమైన నటనతో ఆకట్టుకున్న ఉపేంద్ర ప్రజాకీయ పార్టీ పేరుతో లోక్‌సభకు పోటీపడుతుంటే, మెదక్ ఎంపీగా విజయశాంతి, ఏపీ ఎన్నికల్లో నగరి నుంచి శాసన సభ్యురాలిగా రోజా, హిందూపురం శాసన సభ్యుడిగా బాలకృష్ణ, కేరళ బీజేపీ తరపున ఎంపీగా సురేష్ గోపీ పోటీకి దిగుతున్నాడు. అయితే ఇంత మంది సీనీతారల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.