ఏదైనా సరే మన యువ హీరోలు తమ చిత్రాల విడుదల తేదీలలో మంచి అండర్‌స్టాండింగ్‌ని చూపించారు. నాగచైతన్య ‘మజిలీ’ని ఏప్రిల్5, సాయిధరమ్‌తేజ్ ‘చిత్రలహరి’ని ఏప్రిల్12, నాని ‘జెర్సీ’ ఏప్రిల్19, బెల్లకొండ సాయిశ్రీనివాస్ ‘సీత’ ఏప్రిల్25న.. ఇలా తలా వారం గ్యాప్ ఇస్తూ తమ సినిమాల రిలీజ్ డేట్స్‌ని ఫిక్స్ చేసుకున్నారు. అయితే వీటిలో ‘మజిలీ’ చిత్రం ఎన్నికలకు ముందు ఆరు రోజుల ముందుగా విడుదల కానుండటం కాస్త ఓపెనింగ్స్‌పై ఎఫెక్ట్ చూపించడం ఖాయమంటున్నారు.
మరో వైపు సాయిధరమ్‌తేజ్ హీరోగా కిషోర్‌తిరుమల దర్శకత్వంలో ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తున్న ‘చిత్రలహరి’ చిత్రానికి ఓ డబ్బింగ్ చిత్రం పోటీని ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఆ చిత్రమే తమన్నా నటించిన ‘దేవి2’. గతంలో వచ్చిన ‘అభినేత్రి’ తరహాలోనే ఈచిత్రం ఉండనుంది. ఇక నాని ‘జెర్సీ’ విషయానికి వస్తే ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. కానీ అదే రోజు బాలీవుడ్ భారీ చిత్రం ‘కళంక్’ని విడుదల చేయాలని భావించారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రాన్ని మరో రెండు రోజులు ముందుగా అంటే ఏప్రిల్ 17నే విడుదల కానుంది. ఈ రెండు రోజుల్లో చిత్రం ఫలితం తెలిసిపోతుంది కాబట్టి ‘ఎ’ సెంటర్స్‌లో కూడా ‘జెర్సీ’కి ‘కళంక్’ పోటీ కావడం లేదు. కానీ మరోవైపు వరుసగా హర్రర్ కామెడీ చిత్రాల ద్వారా విజయపథంలో దూసుకెళ్తున్న రాఘవలారెన్స్ ప్రస్తుతం ‘కాంచన3’ తీస్తున్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా ఇంతకు ముందు వచ్చిన ‘ముని, కాంచన, గంగ’ చిత్రాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. దాంతో ‘కాంచన3’ని కూడా తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి ఏప్రిల్ 19న విడుదల చేస్తారని తెలుస్తోంది.
పోనీ తెలుగులో విడుదల ఆపాలంటే ఏ మాత్రం నెగటివ్ టాక్ వచ్చినా భారీ డ్యామేజ్ తప్పదు. ఈ విషయాన్ని తాజాగా ‘విశ్వాసం, అంజలి సిబిఐ’ చిత్రాలు నిరూపించాయి. ఇక ‘కాంచన3’ కూడా హర్రర్ బ్యాక్‌డ్రాపే అయినప్పటికీ పాముల బ్యాక్‌డ్రాప్‌లో వృద్ధ గెటప్ వేసిన లారెన్స్ ఈచిత్రం కూడా వైవిధ్యభరితంగా ఉంటుందని హింట్ ఇస్తున్నాడు. మరికొద్దిరోజుల్లోనే లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాంచన3’కి సంబంధించిన అఫీషియల్ రిలీజ్‌డేట్ రానుంది. అది వచ్చే వరకు నాని ‘జెర్సీ’పై అనుమానపు నీడలు తొలగిపోవనే చెప్పాలి.