తెలుగులో సీక్వెల్స్ పెద్దగా ఆకట్టుకోలేవని, బాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడ్ ప్రేక్షకులు సీక్వెల్స్‌నే కాదు.. ఆ తరహా క్లాసిక్ చిత్రాల టైటిల్స్‌తో వచ్చే వేరే కథలను కూడా ఆదరించరని ఇప్పటికే నిరూపితం అయింది. కేవలం బాహుబలి తప్ప ఆర్య, గబ్బర్‌సింగ్ వంటి చిత్రాలకు సీక్వెల్స్‌గా వచ్చిన ఆర్య2, సర్దార్‌గబ్బర్‌సింగ్ వంటివి ఘోరపరాజయం పాలైయ్యాయి. ఇక చిరంజీవి నటించిన మున్నాబాయ్ రీమేక్ రెండో సీక్వెల్ అయిన శంకర్‌దాదా జిందాబాద్ కూడా అదే కోవలోకి వస్తుంది.
అయితే టాలీవుడ్‌లో ఎప్పుడు కొత్తదనం పోషించే నిత్య మన్మథుడు నాగార్జున మాత్రం ఇలాంటి సెంటిమెంట్లను పక్కనపెట్టి వరుసగా మూడు సీక్వెల్స్‌లో రానున్నాడనే వార్త సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. నాగార్జున కెరీర్‌లోనే క్లాసిక్‌గా నిలిచిపోయి, త్రివిక్రమ్ శ్రీనివాస్, విజయ్‌భాస్కర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన మన్మథుడు కి సీక్వెల్‌గా, చిలసౌ వంటి ఒకే ఒక్క చిత్రం అనుభవం ఉన్న రాహుల్‌రవీంద్రన్‌తో నాగ్ ‘మన్మథుడు 2’ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ముహూర్తం కూడా ఖరారైంది. ఈనెల 25న పూజా కార్యక్రమాలు జరిపి, అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్‌ని కూడా మొదలుపెడతారట. తొలి షెడ్యూల్ 10 నుంచి 15రోజుల పాటు ఉంటుందని సమాచారం. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారట.
ఇక ‘సోగ్గాడే చిన్నినాయనా’కి సీక్వెల్ కాకుండా ‘బంగార్రాజు’ పేరుతో ప్రీక్వెల్‌లో నటించేందుకు కూడా నాగ్ కళ్యాణ్‌కృష్ణకి ఓకే చెప్పాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇంతకాలానికి కళ్యాణ్‌కృష్ణ తయారు చేసిన ఫుల్‌స్క్రిప్ట్ నాగ్‌కి నచ్చడంతో ఓకే చెప్పాడు. ఇందులో నాగార్జున మనవడిగా మరో రసిక రాజుగా నాగచైతన్య నటిస్తాడని సమాచారం.
ఇక ‘రాజుగారి గది 2’ అనుకున్న విజయం సాధించకపోయినా ఓంకార్ దర్శకత్వంలో ‘రాజుగారి గది 3’కి నాగ్ ఓకే చెప్పాడట. దాదాపు ఈ మూడు చిత్రాలు నాగార్జున సొంత నిర్మాణంలో అన్నపూర్ణ బేనర్స్‌లో రూపొందుతాయని సమాచారం. ఇవి గానీ హిట్టయితే రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో కూడా ఈ సీక్వెల్స్, ప్రీక్వెల్స్ హవా పెరగడం ఖాయమనే చెప్పాలి.