రాజమౌళి.. టాలీవుడ్‌లో అపజయమే ఎరుగని దర్శకుడు. ఇక మగధీర, ఈగ, బాహుబలి-ది బిగినింగ్, బాహుబలి-ది కన్‌క్లూజన్‌ల తర్వాత ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’లో బిజీగా ఉన్నాడు. తెలుగులో దశాబ్దాల తర్వాత ఒకే స్థాయి ఇమేజ్, క్రేజ్, మార్కెట్, ఏజ్‌గ్రూప్‌లకు సమానమైన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ఆయన అసలుసిసలు మల్టీస్టారర్‌ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో సినిమా నేపధ్యం నుంచి ఎన్టీఆర్, రామ్‌చరణ్ పాత్రలను అలియాభట్‌తో పాటు మరో విదేశీ యువతిని హీరోయిన్లుగా ప్రకటించాడు. సినిమా షూటింగ్ ఇంకా 25శాతం కూడా పూర్తికాని నేపధ్యంలో ఈ చిత్రంపై పెరుగుతున్న అంచనాలను చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. దీనిని కూడా ‘బాహుబలి’ టైప్‌లోనే ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. బడ్జెట్ పరంగా 350 కోట్ల నుంచి 400 కోట్ల మధ్య రూపొందుతున్న ఈ చిత్రంలో అలియాభట్, అజయ్‌దేవగణ్‌లు నటిస్తుండటం వల్ల బాలీవుడ్ నుంచి కూడా ఈ చిత్రం కోసం భారీ ఆఫర్లు వస్తున్నాయి.
ధర్మ ప్రొడక్షన్స్ అధినేత, ‘బాహుబలి’ బాలీవుడ్ హక్కులను చేజిక్కించుకున్న కరణ్‌జోహార్‌తో పాటు రిలయన్స్ సంస్థలతో సహా పలువురు నిర్మాతలు ఈ చిత్రం హక్కుల కోసం పోటీ పడుతున్నారు. ఇక ఈ చిత్రం అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వంటి దేశభక్తుల నేపధ్యంలో కొనసాగుతోంది. భగత్‌సింగ్ తరహా పాత్రలో ఫ్లాష్‌బ్యాక్‌లో అజయ్‌దేవగణ్ కూడా దేశ స్వాతంత్య్ర సమరయోధుడిగా కనిపిస్తాడని సమాచారం. ఇక ఇంతలో ఈ మూవీలో సంజయ్‌దత్ కూడా ఓ కీలక పాత్రను చేస్తున్నాడని, అలాగే మరో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. గతంలో సంజయ్‌దత్, నాగార్జున నటించిన ‘చంద్రలేఖ’ చిత్రంలో కామియో పాత్రను చేస్తున్నాడు. మరోవైపు ఆయన తాజాగా ‘కేజీఎఫ్’ సీక్వెల్‌లో కూడా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇక ‘ఆర్.ఆర్.ఆర్’లో అలియాభట్, అజయ్‌దేవగణ్‌లతో పాటు సంజయ్‌దత్, వరుణ్ ధావన్ లు కూడా నటిస్తే బాలీవుడ్‌లోనే కాదు... అన్ని భాషల్లో ఈ చిత్రానికి భారీ డిమాండ్ ఏర్పడటం ఖాయమనే చెప్పాలి. ఇతర భాషా స్టార్స్‌ని కేవలం పాన్ ఇండియా మార్కెట్ కోసం నటీనటులను తీసుకోనని రాజమౌళి చెప్పినా కూడా ఆయన ఎంపిక చేస్తోన్న ఆర్టిస్టులను చూస్తే పాన్ ఇండియా ఇమేజ్ కోసమే ‘ఆర్.ఆర్.ఆర్’లో ఇలాంటి స్టార్స్‌ని పెట్టుకుంటున్నాడనేది నిజమని కొందరు విశ్లేషిస్తున్నారు.