వచ్చే శుక్రవారం అంటే మార్చి 29 న టాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర మూడు నాలుగు సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. గత నెలరోజులుగా బోసి పోయిన థియేటర్స్ అన్ని మార్చి 29 నుండి కళకళలాడనున్నాయి. ఈ వారం ఏవో డబ్బింగ్ అండ్ బూతు సినిమాలు బరిలోకి దిగితే.... ప్రేక్షకులు ఆ సినిమాలను అలాగే వెనక్కి పంపించేందుకు రెడీ అయ్యారు. ఇక విద్యార్థుల పరీక్షల సమయం ముగియడంతో.. ఇక చిన్న పెద్ద సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చెయ్యడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నెల 29 న వచ్చే శుక్రవారం లక్ష్మీస్ ఎన్టీఆర్, నిహారిక సూర్యకాంతం, నిఖిల్ అర్జున్ సురవరం సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి.
రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకించి.. ప్రమోషన్స్ చెయ్యకపోయినా.. రోజూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ మీడియాలో నానుతూ ఉండేలా భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ని థియేటర్స్ లో చూస్తామా అనే క్యూరియాసిటీని వర్మ ప్రేక్షకుల్లో కలిగించాడు. ఇక మెగా డాటర్ నిహారిక కూడా సూర్యకాంతం ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. ఈరోజు జరగబోయే సూర్యకాంత ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏ మెగా హీరోనో గెస్ట్ గా వస్తాడనుకుంటే.. ప్రస్తుతం యూత్ లో భారీ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ గెస్ట్ అన్నారు. దానితో సూర్యకాంతం మీద యూత్ లో క్రేజ్ వచ్చేసింది.
ఇక మిగిలిన మరో సినిమా నిఖిల్ అర్జున్ సురవరం... ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ మీడియాలో వినిపించడం లేదు. నిన్న మొన్నటివరకు టైటిల్ విషయంలో తెగ హైలెట్ అయిన అర్జున్ సురవరం నేడు.. విడుదల విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. గత ఏడాది నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. ఎట్టకేలకు మార్చి 29 న విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ఇప్పడు చడీ చప్పుడు చెయ్యడం లేదు. అసలు నిఖిల్ ఈసారైనా ప్రేక్షకుల ముందుకు వస్తాడా రాడా అనేది మాత్రం ఫుల్ సస్పెన్స్ అన్నట్టుగా వుంది. అసలే క్రేజ్ లేని ఈ సినిమాపై ఇప్పుడు ఈ విడుదలపై కమ్ముకున్న నీలి నీడలు... నిఖిల్ ఎలా తొలిగిస్తాడో చూడాలి.