సినీ నటులు రాజకీయాలలోకి వస్తే వారికి అభిమానులు ఎంత బలమో... కొన్ని సార్లు అదే వీరాభిమానులు వారికి అంత బలహీనతగా మారుతారు. నిజానికి జనసేనాధిపతి పపన్ భావాలు, భావజాలం, ఆయన సిద్దాంతాలు అన్ని అందరికీ నచ్చుతాయి. కానీ పవన్‌ని ఒక్క మాట విమర్శించినా కూడా ఆయన అభిమానులు రెచ్చిపోయే విధానం మాత్రం అందరిలో పవన్‌ని, ఆయన ఫ్యాన్స్‌ని అభాసుపాలు చేస్తోంది. కానీ పవన్ మాత్రం తన అభిమానులను ఎప్పుడు ఖండించడు. తన ఫ్యాన్స్‌ని వెనకేసుకొచ్చి వారికి వంత పాడుతూ ఉంటాడు. కానీ దాదాపుగా తొలిసారి పవన్ తన అభిమానుల విషయంలో మండిపడ్డాడు.
ఆయన పలాస సభలో మాట్లాడుతూ, కళింగ వైశ్యులకు తగిన ప్రాధాన్యం ఇస్తానని, వీలుంటే రిజర్వేషన్లు కల్పిస్తానని మాట ఇచ్చాడు. అది వీలుకాకపోతే జనసేన తరపున కళింగ వైశ్యులకు పెద్దపీట వేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా సభాస్థలి దగ్గరకు వెళ్లిన కొందరు అభిమానులు స్టేజీ పట్టుకుని వేలాడుతూ, పవన్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. వారిని ఒకటికి రెండు సార్లు పవన్ వారించాడు. అయినా వారు మాట వినలేదు. దాంతో చివరకు పవన్ సహనం కోల్పోయాడు. బాబూ.. ఇక్కడ ఉన్న వారందరు కొంత అతి చేయకండమ్మా...! అతి ఎక్కువైంది.. ఇది పద్దతా? ఇదేనా నువ్వు నేర్చుకుంది. నువ్వు ఉత్తరాంధ్రకు చేసేది ఇదేనా? మీరు ఉత్తరాంధ్రకు చేసే సేవ ఇదేనా? ఇంతమంది పెద్దలు ఇక్కడ ఉండగా, ఇదా మీరు చేసేది? అక్కడ అచ్చెనాయుడు, ధర్మాన ప్రసాదరావు వంటి వారు గెలిచేది మీలాంటి వారి వల్లనే. మీకు ఉత్తరాంధ్ర వెనుకబడినతనం మీద కోపం లేదు. కానీ నాకు కోపం ఉంది. అల్లరిచిల్లరిగా ప్రవర్తిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ది కాదు... అంటూ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. మొత్తానికి ఇంత కాలానికి జనసేనాని తన అభిమానుల ధోరణిని తప్పుపట్టి, వారిలోని లోపాలను ఎత్తి చూపడం హర్షణీయమనే చెప్పాలి.