దర్శకుడు మారుతీ నిర్మాణంలో సుధీర్ బాబు - నందిత జంటగా తెరకెక్కిన ‘ప్రేమకథాచిత్రమ్’ హర్రర్ కామెడీగా సాలిడ్ హిట్ కొట్టడమే కాదు.. ఇప్పటికీ బుల్లితెర మీద ప్రేమకథాచిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. మరి ఆ ప్రేమ కథా చిత్రానికి సీక్వెల్‌గా సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా - సిద్ధి ఇద్నానీ జంటగా తెరకెక్కిన ప్రేమకథాచిత్రమ్2 ఉగాది కానుకగా విడుదలైంది. మరి ప్రేమకథాచిత్రమ్‌ని దృష్టిలో పెట్టుకుని థియేటర్‌కి ప్రేమకథాచిత్రమ్2 చూడడానికి వెళ్లి ప్రేక్షకుడికి ఆ సినిమా చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది అంటే ఆ సినిమా ఎలా ఉందో ఈ పాటికే అర్ధమై ఉంటుంది.
ఇక ప్రేమకథాచిత్రమ్2 కథలోకి అలా అలా వెళితే.. సుధీర్ (సుమంత్ అశ్విన్) డిగ్రీ చదువుతుంటాడు. అదే కాలేజీలోనే చదువుతున్న బిందు(సిద్ధి ఇద్నానీ).. సుధీర్‌ని ప్రేమిస్తుంది. సుధీర్‌నో చెప్పడంతో మనస్తాపానికి గురై, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. కానీ సుధీర్ మాత్రం తాను వేరే అమ్మాయిని ప్రేమించానని.. తననే పెళ్లి చేసుకుంటానని బిందుతో చెప్తాడు. ఈలోగా సుధీర్‌కి ఇంట్లో ఓ సంబంధం ఖాయం చేస్తారు. నందిత శ్వేతా(నంద)తో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఈలోపు సుధీర్ అనుకోకుండా ఓ ఫామ్ హౌస్‌కి వెళ్తాడు. అక్కడ సుధీర్‌కి రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. అసలు సుధీర్‌కి అక్కడ ఎదురైన సంఘటనలు ఏమిటి? ఇంతకీ నందినికి పట్టిన ఆత్మ ఎవరిది? చిత్రకి బిందుకి ఉన్న లింకేంటి? నందినికి పట్టిన దెయ్యం ఎలా వదిలింది? సుధీర్, నందినిలు ఒక్కటయ్యారా? లేదా? అనేది ప్రేమకథాచిత్రమ్2 మిగతా కథ.
సీన్‌కి సీన్‌కి మధ్య కంటిన్యుటీ లేకుండా లాజిక్ లేని స్క్రీన్‌ప్లేతో కథను నడిపించాడు దర్శకుడు. కథతో పాటు పాత్రల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తూ.. అసలు దెయ్యం ఎవరు.. ఎవరి ఆత్మ ఎవర్ని ఆవహించింది... అనే ఆందోళలతో తికమకపెట్టాడు. ఫామ్ హౌస్‌లోకి కథ ఎంటర్ అయిన తరవాతైనా, సినిమా జోరందుకుంటుందనుకుంటే అదీ ఉండదు. రాత్రి సమయంలో దెయ్యం రావడం, మిత్రబృందం భయపడడం ఇవి అటు భయాన్నీ, ఇటు వినోదాన్నీ ఇవ్వలేకపోయాయి. సెకండ్ హాఫ్‌లో కథనం మరింత నెమ్మదిస్తుంది. లాజిక్ లేని కథ, కథనాలు మరింత బోర్ కొట్టిస్తాయి. తీరా క్లైమాక్స్ రీజనబుల్ అనేపించే ట్విస్ట్ ఏమైనా ఉందా అంటే.. దెయ్యంలో మేలుకొలుపు రప్పించి ప్రేక్షకులను పిచ్చివాళ్లను చేసాడు. ఈలెక్కన మరి ప్రేమకథ చిత్రం హిట్ అయితే.. ప్రేమకథాచిత్రమ్2 మాత్రం ఆ ఛాయలకు కూడా వెళ్లలేకపోయింది.