తన తమ్ముడు జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ తన చిన్నన్నయ్య నాగబాబుకి నరసాపురం ఎంపీ సీటు ఇచ్చాడు. నాగబాబు మాత్రం తన మెగా కాంపౌండ్ హీరోలెవ్వరు తనకు మద్దతుగా ప్రచారానికి రాకపోయినా కూడా తాను ఒక్కడే రెండు రోజుల పాటు ఒంటరి ప్రచారం చేశాడు. కేవలం వారసత్వం, తమ్ముడి వల్లన గెలవడం కాదు.. తన నిజాయితీ, నిబద్దతతో గెలవాలని నాగబాబు చిత్తశుద్దితో కష్టపడుతున్నాడు. జబర్ధస్త్ షోకి సైతం గ్యాప్ ఇచ్చి నరసాపురంలో ప్రచారం చేస్తున్నాడు. ఇన్ని రోజుల తర్వాత ఆయనకు మద్దతుగా ఆయన శ్రీమతి పద్మజ, కుమార్తె నిహారికలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక జబర్ధస్త్ టీంలోని కొందరు కూడా తమకు నాగబాబుపై ఉన్న అభిమానంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
మొదట్లో నాగబాబు తరపున చరణ్, అల్లుఅర్జున్‌లు కూడా ప్రచారానికి వస్తారని వార్తలు వచ్చాయి. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ బిజీలో రామ్‌చరణ్ ఎస్కేప్ అయితే, ఇక బన్నీ అయితే ఓ లెటర్‌తో సరిపుచ్చాడు. ఇక సాయిధరమ్‌తేజ్, అల్లు శిరీష్‌లు ‘చిత్రలహరి, ఎబిసిడి’ విడుదల హడావుడిలో ఉన్నారు. ఇక వరుణ్‌తేజ్ మాత్రం తన తండ్రి కోసం రంగంలోకి దిగిపోయాడు. ఆయన తాజాగా షూటింగ్ నుంచి నేరుగా నరసాపురం వచ్చి ప్రచారంలో పాల్గొన్నాడు. మాస్, యూత్‌ని అలరించేలా జనసేన మార్క్ టవల్‌ని మెడకు చుట్టుకున్నాడు. ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తూ, తన తండ్రికి ఓటేసి గెలిపించాలని కోరాడు. మధ్య మధ్యలో కారు ఆపి ప్రసంగాలు చేశాడు. తన బాబాయ్ ఆశయ సాధన కోసం నా తండ్రి ఎన్నికల బరిలో దిగారు. ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించండి... అంటూ అందరినీ అభ్యర్ధించాడు.