ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాలలోకి రావడానికి నిర్ణయించుకోవడంతో ఈయన చేసిన ప్రతి చిత్రం ముందు ఇదే ఆయన చివరి చిత్రం అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయినా ఆయన ‘కబాలి, 2.ఓ. కాలా, పేట’ వంటి వరుస చిత్రాలను అంగీకరిస్తూనే ఉన్నాడు. ఇక ఇటీవల ఆయన తాను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనని, కేవలం వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తానని ప్రకటించాడు. పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎవ్వరికీ మద్దతు ఇచ్చేది లేదని, తన పేరు, తన గుర్తులను వాడుకోవడం సహించనని వార్నింగ్ కూడా ఇచ్చాడు.
ఇంతలో ఆయన దేశం గర్వించదగ్గ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో మొట్టమొదటి సారి నటించే చిత్రానికి ఓకే చెప్పాడు. ‘దర్బార్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ తాజాగా ముంబైలో ప్రారంభం అయింది. ఇది ముంబై బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్టోరీ. ఇందులో రజనీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, సామాజిక కార్యకర్తగా నటిస్తున్నాడు. ఇక రజనీతో తమ కెరీర్‌లో ఒక్క సినిమా చేసినా చాలు తమ జీవితం ధన్యమవుతుందని పలువురు దర్శకులు రజనీకి ఎన్నో కథలు వినిపించారట. వీటిల్లో ఆయన గతంలో తనతో పనిచేసి, చివరగా ‘లింగా’ వంటి డిజాస్టర్ అందించిన కె.యస్.రవికుమార్, వినోద్ ల కథలను ఓకే చేశాడని తెలుస్తోంది.
ఈ ఇద్దరు వినిపించిన కథలు కొత్తగా ఉండటం, ఇంతవరకు తాను ఆ తరహా పాత్రలను చేసి ఉండకపోవడంతో ఈ ఇద్దరికీ మాత్రమే రజనీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని, ‘దర్బార్’తో పాటు ఈ రెండు చిత్రాలు చేసిన తర్వాత ఇక రజనీ సినిమాలకు బై చెప్పి పూర్తి సమయం రాజకీయాలకు కేటాయిస్తాడని తెలుస్తోంది. ఇక ‘దర్బార్’ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.