టాలీవుడ్‌లో నారా రోహిత్, సుధీర్‌బాబు కలిసి నటించినా, లేక నాగశౌర్య, శ్రీవిష్ణు వంటి వారు కలిసి ఓ చిత్రంలో నటించినా కూడా ఆ చిత్రాలను మల్టీస్టారర్స్ అని పిలుస్తుంటారు. మరోవైపు సీనియర్ స్టార్‌తో కలిసి యంగ్ హీరోలు కలిసి నటించే చిత్రాలకు కూడా మల్టీస్టారర్ అనే ట్యాగ్‌ని తగిలించేస్తూ వస్తుంటారు. ఓ హీరో చిత్రంలో మరో హీరో కామియో వంటి పాత్రను చేసినా అదే బాపత్తు కింద లెక్క కడతారు. కానీ వయసు, ఇమేజ్‌లలో సరిసమానమైన స్టార్ ఇమేజ్ ఉన్నవారి చిత్రాలనే అసలు సిసలైన మల్టీస్టారర్స్ అని చెప్పాలి. దీనికి ఉదాహరణ నాటి ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి వంటి వారు కలిసి నటించిన చిత్రాలనే ఉదాహరణగా చెప్పాలి. మరలా ఇంతకాలం తర్వాత ఒకే ఏజ్‌గ్రూప్, సరిసమానమైన స్టార్ ఇమేజ్‌లు కలిగిన రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు నటిస్తూ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మాత్రమే అసలు సిసలు మల్టీస్టారర్ కోవకి వస్తుంది.
ఇక విషయానికి వస్తే తెలుగులో హీరో నానికి స్టార్ స్టేటస్ ఉంది. ఆయన్ను అందరు నేచురల్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన ‘జెర్సీ’ చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో ‘గ్యాంగ్‌లీడర్’ చేస్తున్నాడు. ఇదే సమయంలో ఆయన తనకి హీరోగా బ్రేక్‌నిచ్చి తనతో ‘అష్టాచెమ్మా, జెంటిల్‌మేన్’ వంటి విజయవంతమైన చిత్రాలను తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో నేచురల్‌స్టార్ నానితో పాటు మలయాళ యంగ్ స్టార్ దుల్కర్‌సల్మాన్‌లతో నటింపజేయాలని భావించారు.
ఈ ఇద్దరు కలిసి నటిస్తే అది ఖచ్చితంగా మల్టీస్టారర్ అయ్యేది. కానీ చివరి నిమిషంలో ఇంద్రగంటి ఈ చిత్రంలో దుల్కర్‌సల్మాన్‌కి బదులు తాను ‘సమ్మోహనం’ తీసిన సుధీర్‌బాబుని హీరోగా తీసుకున్నాడు. ఏ విధంగా చూసినా సుధీర్‌బాబు మామూలు హీరో కేటగరి కిందకి వస్తాడే గానీ స్టార్ హీరో రేంజ్‌కి రాడు.
మరో విశేషం ఏమిటంటే ఇందులో నేచురల్ స్టార్ నాని పాత్ర కేవలం 15 నుంచి 20 నిమిషాల లోపే ఉంటుందట. కానీ ఈ పాత్ర ‘పెదరాయుడు’లో రజనీకాంత్, ‘ఎవడు’లో అల్లుఅర్జున్ తరహాలో ఎంతో కీలకం కాబట్టే నాని ఇందులో నటించడానికి ఓకే చెప్పాడని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని దిల్‌రాజుతో పాటు నాని కూడా కలిసి నిర్మిస్తున్నారని సమాచారం. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి ‘వ్యూహం’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. ఏదిఏమైనా ఈ చిత్రాన్ని మల్టీస్టారర్ అని చెప్పడం మాత్రం సరికాదనే చెప్పాలి.