తెలుగువారికి కూడా క్రికెట్ అంటే పిచ్చి. కులం, మతం, ప్రాంతీల కతీతంగా క్రికెట్‌ని ఒక మతంలా మనవారు కూడా కొలుస్తారు. కానీ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన స్టోరీలు మాత్రం ఇక్కడ పెద్దగా ఆడలేదు అనేది వాస్తవం. బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన పలువురి బయోపిక్‌లు కూడా కేవలం ఆన్‌లైన్‌లో చూసి ఎంజాయ్ చేశారే గానీ పోలోమంటూ థియేటర్లకు వెళ్లి హౌస్‌ఫుల్ చేసింది లేదు. ప్రకాష్‌రాజ్ 'ధోని', సుమంత్ 'గోల్కోండ హైస్కూల్' వంటి చిత్రాలు కూడా ఇక్కడి ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ కాలేదు. అసలు క్రికెట్‌ని నేపధ్యంగా తీసుకోవడంలో ఎంతో రిస్క్ ఉంది. కానీ అలాంటిది ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేయాలని నాని పట్టుదలతో ఉన్నాడు. గతంలో నిజజీవితంలో క్రికెట్ ప్రేమికుడైన విక్టరీ వెంకటేష్ కూడా 'బ్రహ్మరుద్రులు' చిత్రంలో కాసేపు సరదాగా బ్యాట్ పట్టి కనిపించారే గానీ పూర్తిస్థాయి అవకాశాలు వచ్చినా నో చెప్పారు.
ఇక 'జెర్సీ' సినిమాలో మద్య వయసు దాటిన తర్వాత ఓ పదేళ్ల పిల్లాడి తండ్రి తన కుమారుడి కోసం బ్యాట్ పట్టడం అనేది ఎంతో ఎమోషన్స్‌తో కూడిన ప్రయాసమే. దీనిని జనరంజకంగా చెప్పడంలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరు ఎంత వరకు సఫలీకృతుడు అయ్యాడో వేచిచూడాల్సివుంది. ఇక ఇదేదో చిన్న బడ్జెట్ చిత్రం అయితే ఫర్వాలేదని భావించవచ్చు. కానీ ఇందులో నేచురల్‌స్టార్ నాని నటిస్తున్నాడు. థియేటికల్ బిజినెస్ కూడా పాతిక కోట్లను దాటింది. ఇక ఇందులో ఎక్కువగా సెంటిమెంట్‌కి, ఎమోషన్స్‌కి పెద్దపీట వేశారని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతోంది. మరోవైపు కొద్దిరోజుల కిందటే నాగచైతన్య కూడా బ్యాటు పట్టి 'మజిలి'తో హిట్ కొట్టాడు. 'మజిలి' చిత్రం కూడా ఎమోషన్స్‌తో కూడిన చిత్రమే. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చినా ఓవర్‌సీస్‌లో ఈ చిత్రానికి పెద్దగా ఆదరణ లభించడం లేదు.
ఓవర్‌సీస్ ఆడియన్స్ హిలేరియస్ కామెడీకి ఇచ్చిన ప్రాధాన్యం ఇలాంటి సెంటిమెంట్ చిత్రాలకు ఇవ్వరని ఓ వర్గం వాదిస్తోంది. మరోవైపు ఈ చిత్రానికి పోటీగా విడుదలవుతున్న హర్రర్ కామెడీ చిత్రం 'కాంచన3'కి మాస్‌లో మంచి క్రేజ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. కామెడీ ఏమాత్రం కొత్తగా ఉన్నా ఈ చిత్రం ఓవర్‌సీస్‌లో కూడా 'జెర్సీ'కి పోటీగా నిలిచే అవకాశాలను కొట్టిపారేయలేం. మరి ఈ పరిస్థితుల్లో నాని తన మ్యాజిక్‌తో ఈ చిత్రానికి యునానిమస్ హిట్ టాక్ తెస్తే తప్ప సేఫ్ అయ్యే అవకాశాలు ఉండవంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచిచూడాల్సివుంది... తెలుగు ప్రేక్షకులు ఈమధ్య వైవిధ్యభరితమైన చిత్రాలను ఆదరిస్తూ ఉండటం మాత్రం 'జెర్సీ'కి ప్లస్ పాయింట్‌గా మారనుంది.