గౌతమ్ తిన్ననూరి.. పరిచయం అక్కర్లని పేరే. ఎందుకంటే సుమంత్ హీరోగా మళ్ళీ రావా అనే ఎమోషనల్ లవ్ స్టోరీతో గతంలోనే ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు. పద్నాలుగేళ్ల వయసులో ప్రేమలో పడ్డ జంట, పరిస్థితుల కారణంగా విడిపోయి మళ్లీ పదమూడేళ్లకి కలుస్తారు. తమ మధ్యన ఉన్న స్పర్ధలన్నీ తొలగిపోయి ఒక్కటవుతారు కానీ మళ్లీ ఇద్దరూ విడిపోతారు. అమ్మాయికి పెళ్లి కుదుర్తుంది. అబ్బాయి ఉద్యోగ రీత్యా విదేశాలకి బయల్దేరే పనుల్లో వుంటాడు. ఇద్దరూ మరోసారి తారసపడతారు. అప్పుడేం జరుగుతుంది అనే పాయింట్ నే కథగా అల్లి మళ్లీ రావా సినిమాని తెరకెక్కించాడు గౌతమ్. అక్కడ ప్రేమకథని హృద్యంగా ముగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మళ్లీరావా డైలాగ్స్ చాలా బాగుంటాయి. మళ్లీ రావా చివరి 20 నిమిషాలే సినిమాకి మెయిన్ బలం. థియేటర్ నుంచి బయటకి వచ్చేటప్పుడు చెమర్చిన కళ్లతో, ఫీల్‌గుడ్ అనుభూతితో పంపించేంత స్టఫ్ ఉన్న దర్శకుడు గౌతమ్ తిన్నసూరి.
మరి తాజాగా గౌతమ్ తిన్నసూరి మంచి టీంతో నానితో జెర్సీ ఆడాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్‌ని, సినిమాటోగ్రాఫర్‌గా సాను వరగేసేని, నిర్మాతగా సూర్యదేవర నాగ వంశీని సెట్ చేసుకున్న దర్శకుడు.. హీరోగా నానిని సెలెక్ట్ చేసుకోవడంతోనే జెర్సీ సినిమా సగం హిట్ ని ఖాతాలో వేసేసుకున్నాడు. జెర్సీతో నాని అయితే తనకి తానే ఒక బెంచ్‌మార్క్ సెట్ చేసుకున్నాడు. ఇక జెర్సీ సినిమా చూసాక దర్శకుడు గౌతమ్ నిజంగా ఒక కావ్యాన్నే తెరకెక్కించాడనే అనిపిస్తుంది. దర్శకుడు కథను ఊహిస్తే, హీరోగా నాని దాన్ని నిజం చేసి కళ్ల ముందు వుంచాడు. దర్శకుడు చెప్పిన పెయిన్‌ను తన కళ్లలో పలికించి నాని అందరిని మెస్మరైజ్ చేసాడు. నాని ఆ ఫీట్ ను అద్భుతంగా చేసాడు. టాలెంట్ ఉన్న దర్శకుడికి టాలెంట్ ఉన్న హీరో దొరికితే ఆ సినిమా ఎలా ఉంటుందో అనేది ఈ జెర్సీ నిరూపిస్తుంది.
క్రికెట్ లాంటి స్పోర్ట్స్‌ను అంత ఫెర్‌ఫెక్ట్‌గా వర్కవుట్ చేసి, ఆడి చూపించడం, మెప్పించడం నటుడిగా నానికి అది చిన్న విషయం కాదు. అంతేకాదు ఎక్కడా ప్రొఫెషనల్స్ కూడా వంకపెట్టలేని విధంగా క్రికెట్ మ్యాచ్‌లను చిత్రీకరించారు. నిజానికి క్రికెట్ మ్యాచ్‌లను అంత లెంగ్తీగా చిత్రీకరించి.. ప్రేక్షకులను కూర్చోపెట్టగలం అనుకోవడం కాస్త సాహసమే. కానీ ఆ మ్యాచ్‌లను అత్యంత రియలిస్టిక్‌గా చిత్రీకరించడం అన్నది మెచ్చుకొదగ్గ విషయం. అక్కడే దర్శకుడు సక్సెస్ అయ్యాడు. రంజీ ట్రోఫీలో తనకి స్థానం దక్కిందనే ఆనందాన్ని కోచ్‌తో పంచుకునే సీన్ కానీ... పర్సులోంచి డబ్బులు తీస్తూ భార్య ముందు దోషిగా నిలబడే సందర్భం కానీ... అన్నిటికీ మించి అర్జున్ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలియజెప్పే ప్రీ క్లైమాక్స్ కానీ.. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మరి ఈ రెండు హిట్స్‌తో గౌతమ్ తిన్నసూరి స్టార్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారుతాడేమో చూద్దాం.