నాగార్జున కెరీర్‌లో వచ్చిన అతి కొద్ది క్లాసిక్ చిత్రాలలో ‘మన్మథుడు’కి చోటుంటుంది. ఇందులో పేరుకి మన్మథుడే గానీ అమ్మాయిలంటే గిట్టని వ్యక్తి హీరో. ఆడవారి వాసనే పడకుండా వారిని దేశద్రోహులుగా చూస్తూ ఉంటాడు. యాడ్ కంపెనీ నడిపే ఈ సంస్థలోకి కంపెనీ చైర్మన్ అయిన ఆయన మేనమామ అతని ఇష్టం లేకుండా సోనాలిబింద్రేని తెచ్చిపెడతాడు. ఆమె వచ్చిన తర్వాత మన్మథుడులో వచ్చిన మార్పులు ఏమిటి? అనే వాటిని త్రివిక్రమ్ తన కలంతో గిలిగింతలు పెడితే, విజయభాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా ఇందులో కామెడీ కొత్తపుంతలు తొక్కింది. బ్రహ్మానందం, సునీల్‌ల వంటి వారి కామెడీ ఇప్పటికి చూసినా కొత్తదనంతో కనిపిస్తూ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూ ఉంటుంది. మరలా ఇంతకాలానికి అంతటి క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ చేయడానికి స్వయంగా నాగార్జున అంగీకరించాడంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇలాంటి సాహసాలు ఎవ్వరూ చేయరు.
అందునా ఒకే ఒక్క సినిమా ‘చిలసౌ’ అనుభవం ఉన్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగ్ స్వయంగా తన అన్నపూర్ణ బేనర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కోసం ప్రస్తుతం పోర్చుగల్‌లో ఉంది. ఈ చిత్రానికి సంబంధించి నాగార్జున చెట్టుని ఆధారంగా చేసుకుని కసరత్తులు చేస్తున్న ఫొటోలు, రకుల్‌ని ఓ గదిలో చూపిస్తూ కెమెరామెన్, దర్శకుడు తీసిన ఫొటోలు సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మొత్తానికి షష్టిపూర్తి వయసులో కూడా కింగ్ నాగార్జున నవ మన్మథుడుగా ఉన్నాడనే చెప్పాలి. ఇక ఈ చిత్రం మెయిన్ పాయింట్ ఏమిటి? అనే విషయం ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రం కథ ఇదేనని పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ‘మన్మథుడు 2’ చిత్రం పూర్తిగా ‘మన్మథుడు’కి సీక్వెల్‌గా ఉండదట. కేవలం కొద్ది సీన్స్ మాత్రమే అలా ఉంటాయని సమాచారం.
‘మన్మథుడు 2’ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. హీరోకి ఐదారుగురు చెల్లెళ్లు ఉంటారని, ఇది సిస్టర్ సెంటిమెంట్‌తో నడుస్తుందని సమాచారం. అంటే చిరంజీవి ‘హిట్లర్’ తరహాలో. పంచెప్రాణాలైన తన చెల్లెళ్లందరికీ వారికి నచ్చిన పెళ్ళిల్లు చేసి అత్తారింటికి పంపేసరికి మన హీరోగారికి పెళ్లి వయసు దాటిపోయి వయసు పెరుగుతుంది. వయసైపోయిన మన్మధుడుకి పిల్లను వెతికే ప్రయత్నం, అందులోంచి పుట్టిన కామెడీ ఈ చిత్రానికి హైలైట్ అంటున్నారు. ఈ చిత్రంలో నాగ్‌కి జోడీగా అందాల రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తోంది. కోడలుపిల్ల సమంత, భార్య అమలలు కూడా కీలకపాత్రల్లో నటిస్తారని సమాచారం. మరి ఈ మన్మథుడిని అంతే లైటర్‌వేన్‌లో ఏమాత్రం హాస్యం తగ్గకుండా క్లాసిక్‌గా తీర్చిదిద్దడంలో రాహుల్ రవీంద్రన్ ఎంతవరకు సఫలీకృతుడు అవుతాడో వేచిచూడాల్సివుంది...!